కోడింగ్ నైపుణ్యంతో ఉపాధి అవకాశాలు
ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కోడింగ్ నైపుణ్యాలతో ఉపాధి అకాశాలు విస్త్రృతంగా ఉంటాయని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి పేర్కొన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో సోమవారం డిగ్రీ, పీజీ విద్యార్థులకు కోడింగ్ కాంటెస్ట్–25 పోటీలు నిర్వహించారు. శేషారెడ్డి మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులకు దీటుగా ప్రస్తుత సాంకేతిక రంగంలో నిలబడాలంటే కోడింగ్ తప్పనిసరని, కోడింగ్ వల్లే సాధారణ డిగ్రీ విద్యార్థులు సైతం సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించగలుగుతున్నారన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వీడన్ ఎస్‌ఈబీ బ్యాంక్ క్లౌడ్ ఇంజినీర్ కారుమంచి మహేష్ మాట్లాడుతూ ఐటీ రంగంలో ఉద్యోగాలు సాధించడానికి ముందుగా కోడింగ్ అవసరమని, ఇటువంటి పోటీలు నిర్వహించిన ఆదిత్య విద్యాసంస్థలను అభినందించాలన్నారు. అనంతరం ప్రతి కళాశాల నుంచి ముగ్గురిని ఎంపికచేసి 250 మందిని ఉత్తమ కొడర్లుగా ఎంపిక చేసి రూ.2లక్షల 50వేల ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి సుగుణారెడ్డి, డాక్టర్ బీఇవీఎల్ నాయుడు, ప్రిన్సిపాల్ కె.కరుణ, బ్యూలా, కోడింగ్ ట్రైనర్ రాజేష్, ఐటీ మేనేజర్ కార్తీక్ పాల్గొన్నారు.


