అనుమానాస్పద స్థితిలో సెల్ మెకానిక్ మృతి
నిడదవోలు: స్థానిక శాంతినగర్‌లో నివాసముంటున్న సెల్‌ఫోన్ మెకానిక్ మహ్మద్ హఫీజ్ బాషా (39) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై జగన్‌మోహన్‌రావు తెలిపారు. ఈ నెల 14న ఉదయం 9 గంటలకు సెల్ మెకానిక్‌ల మీటింగ్ ఉందని ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి బిర్యానీ కూడా పంపించాడు. తర్వాత రెండు గంటలకు హఫీజ్ బాషాకు భార్య షామున్నిషా ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. రాత్రి కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. సోమవారం ఉదయం 8:30 గంటలకు పట్టణంలోని కాపు కల్యాణ మండపం సమీపంలో ఖాళీ ప్రదేశంలో హఫీజ్ బాషా కిందపడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అతని బంధువులు, స్నేహితులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ప్రైవేట్ వాహనంలో నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడిని పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. హఫీజ్ బాషాకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై జగన్‌మోహన్‌రావు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


