హుండీ సొమ్ము చోరీచేసిన ఇద్దరి అరెస్ట్
దేవరపల్లి: సంగాయగూడెం గంగానమ్మ ఆలయంలో హుండీ సొమ్ములను దొంగిలించిన ఇద్దరిని శనివారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ దేవత గంగానమ్మ గుడిలోని హుండీని ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు బద్దలు కొట్టి, దానిలో నగదును దొంగిలించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీకి పాల్పడిన అదే గ్రామానికి చెందిన బల్లే దుర్గాపండు, తొర్లపాటి రాజును అరెస్ట్ చేసి కొవ్వూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు.
రోడ్డు ప్రమాదంలో
కూలీ మృతి
ప్రత్తిపాడు: జాతీయ రహదారిపై ధర్మవరం గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. స్థానిక పోలీసుల కథనం మేరకు.. పిఠాపురం మండలం పి. రాయవరం గ్రామానికి చెందిన శెట్టి సత్యనారాయణ (54) కూలి పనికి వస్తూ జాతీయ రహదారిని దాటుతున్నాడు. అతడిని అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న కారు ఢీకొంది, ఈ ఘటనలో శెట్టి సత్యనారాయణ మృతి చెందాడు. మృతదేహాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
యువతి అదృశ్యం
పి.గన్నవరం: నాగుల్లంక గ్రామానికి 18 ఏళ్ల యువతి శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి అదృశ్యమైందని ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. ఆ యువతి ఐదు నెలల పాటు రొయ్యల ఫ్యాక్టరీలో పని చేసిందని, అనంతరం నెల రోజుల క్రితం మానేసిందన్నారు. ఈ క్రమంలో శనివారం ఆమె ఇంటి నుంచి అదృశ్యమైందని తెలిపారు. పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించినప్పటికీ ఆచూకీ తెలియక పోవడంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.


