భీమోలులో పులి సంచారం!
గోపాలపురం: మండలంలోని భీమోలు మెట్టపై పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పులి పాదముద్రలను గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు. రాజమహేంద్రవరం అటవీ శాఖ రేంజ్ అధికారి ఎన్.దావీదురాజు, డీఆర్‌ఓ జి.వేణుగోపాల్, ఎఫ్‌బీఓ వై.శ్రీను ఆ ప్రాంతాన్ని శనివారం సాయంత్రం పరిశీలించారు. దావీదురాజు మాట్లాడుతూ భీమోలు కొండపై వ్యవసాయం చేస్తున్న కె.రామకృష్ణ తన పొలంలో పులి, రెండు పిల్లలు కనిపించాయంటూ ఈ నెల 11న సమాచారం ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు భీమోలు కొండపై సర్వే చేస్తున్నామన్నారు. పులికి సంబంధించి ఎటువంటి జాడలూ కనిపించలేదని, ప్రస్తుతం కొండపై ఆరు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామస్తులు, రైతులు, కూలీలు ఒక్కొక్కరిగా కాకుండా ఇద్దరు లేదా ముగ్గురు కలసి సంచరించాలని సూచించారు.


