పాఠం వింటూ.. ప్రాణం వదిలింది
● తరగతి గదిలో విద్యార్థిని హఠాన్మరణం
● కార్డియాక్ అరెస్టుగా భావిస్తున్న వైద్యులు
● రామచంద్రపురంలో ఘటన
రాయవరం: తరగతిలో గదిలో పాఠాలు వింటున్న విద్యార్థిని హఠాత్తుగా బెంచీపై నుంచి పడిపోయి మృతి చెందింది. హుషారుగా వెళ్లిన బాలిక.. విగతజీవిగా రావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివ రాల్లోకి వెళితే.. పసలపూడి గ్రామానికి నల్లమిల్లి వెంకటరెడ్డి, సుజాత దంపతుల కుమార్తె సిరి (16) రామచంద్రపురంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో ఆమె తమ్ముడు 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం పాఠశాలకు యథావిధిగా వెళ్లిన సిరి మొదటి పిరియడ్ జరుగుతుండగా ఒక్కసారిగా కుడివైపునకు పడిపోయింది. వెంటనే ఉపాధ్యాయుడు, సహ విద్యార్థులు ఆ బాలికకు సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. కార్డియాక్ అరెస్టుతోనే సిరి మృతి చెందిందని వారు భావిస్తున్నారు.


