అంగరంగు వైభవం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఏటా ధనుర్మాసోత్సవం ప్రారంభానికి ముందు రోజు స్వామివారి మెట్లోత్సవం నిర్వహించడం, ఆ తర్వాత రోజు నుంచి కనుమ పండగ వరకూ సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవారిని గ్రామంలో ఊరేగించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన (సోమవారం) సత్యదేవుని మెట్లోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ రోజు రత్నగిరి కొండ దిగువన గల తొలి పావంచా నుంచి కొండ మీద సత్యదేవుని ఆలయం వరకూ గల 450 మెట్లకు భక్తులు పూజలు నిర్వహించనున్నారు. దీని కోసం రత్నగిరి మెట్ల మార్గంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి మెట్టుకూ రంగు వేసి ముస్తాబు చేస్తున్నారు.
పల్లకీలో ఊరేగింపు
సోమవారం ఉదయం 8.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముందుగా రత్నగిరి నుంచి కొండ దిగువకు సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువస్తారు. గ్రామంలో వందల మంది భక్తుల నడుమ పల్లకీలో ఊరేగిస్తారు. అనంతరం తొలి పావంచా వద్ద స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడే ఉన్న తొలి మెట్టుకు దేవస్థానం అధికారులు, మహిళలు పూజలు చేసి మెట్లోత్సవాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి స్వామివారి ఆలయం వరకు గల మెట్లకు భక్తులు పూజలు చేసి హారతి ఇస్తారు. ఆ మెట్ల మీదుగా స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళతారు.
16 నుంచి ధనుర్మాసోత్సవాలు
ఈ నెల 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 16వ తేదీ కనుమ పండగ వరకూ ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతి అమ్మవారిని ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి పది గంటల వరకూ అన్నవరం పుర వీధుల్లో పల్లకీలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ఆలయానికి చేరుస్తారు. నెల రోజులు జరిగే ధనుర్మాసోత్సవాలకు స్వామివారి పల్లకీ కూడా ఉండేందుకు దేవస్థానం వేద పండితులు, వ్రత పురోహితులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు వేశారు.
30న ముక్కోటి ఏకాదశి
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 30వ తేదీ తెల్లవారుజాము ఐదు గంటల నుంచి ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలంకరణలో ఉండే సత్యదేవుడు, అమ్మవారిని దర్శించేందుకు భక్తులను అనుమతిస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు వెండి రథంపై ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవారి ప్రాకార సేవ, అదే రోజు రాత్రి కొండ దిగువన వెండి గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు.
జనవరి 14న భోగి ఉత్సవాలు
భోగి పండగ సందర్భంగా జనవరి 14న రత్నగిరి రామాలయం వద్ద భోగి మంట వేస్తారు. పల్లెటూరి వాతావరణం ప్రతిబించించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16న కనుమ పండగ సందర్భంగా కొండ దిగువన పురగిరి క్షత్రియుల రామకోవెల వద్ద సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రభోత్సవం నిర్వహిస్తారు. కాగా.. సత్యదేవుని మెట్లోత్సవం, ధనుర్మాసంలో ఊరేగింపు కోసం స్వామివారి వెండి పల్లకీని ముస్తాబు చేస్తున్నారు. వెండి శంఖ, చక్రాలకు కూడా మెరుగు పెట్టి సిద్ధం చేస్తున్నారు.
రేపు సత్యదేవుని మెట్లోత్సవం
మెట్లకు రంగులు వేసి ముస్తాబు చేసిన
దేవస్థానం సిబ్బంది
16 నుంచి ధనుర్మాసోత్సవాలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
అంగరంగు వైభవం
అంగరంగు వైభవం


