ఆగకొండ అధిరోహిస్తూ..
● ట్రెక్కింగ్ వీరుడిగా
కాకినాడ యువకుడు
● ఎవరెస్ట్ అధిరోహణే
లక్ష్యంగా అడుగులు
కాకినాడ రూరల్: సాహసయాత్రల ప్రపంచంలో కాకినాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దవులూరి కృష్ణ కుమార్ (25) దూసుకుపోతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న అతను తీరిక దొరికినప్పుడల్లా హిమాలయ పర్వత శిఖరాలను అధిరోహిస్తూ తన బలమైన లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకు సాగుతున్నాడు. కృష్ణకుమార్ బీటెక్ పూర్తి చేయగా, అతని తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విశ్రాంత ఉద్యోగి బీవీ స్వామి, తల్లి రాజరాజేశ్వరి గృహిణి. ట్రెక్కింగ్‌పై మక్కువ పెంచుకున్న కృష్ణకుమార్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూనే, తాను ప్రేమించిన ఈ సాహస క్రీడ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తూ.. అసాధ్యమైన ట్రెక్కింగ్ మార్గాలను విశ్వాసంతో పూర్తి చేసుకుంటున్నాడు. దేశంలోని హిమాలయ పర్వతాలు కాశ్మీర్ గ్రేట్ లేక్స్, రూపిన్ పాస్, బ్రహ్మ హాల్, హంత పాస్ రెండు సార్లు పూర్తి చేశారు. పర్వతారోహణ ద్వారా తనదైన ముద్ర వేసుకున్నాడు.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లక్ష్యంగా..
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (ఈబీసీ)ను అధిరోహించే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇందుకు కసరత్తు ప్రారంభించిన ఆయన త్వరలో లక్ష్యం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. 2022లో కేథార్‌నాథ్ గుడికి వెళ్లినప్పుడు ఒక్కరోజులో 25 వేల మీటర్ల ఎత్తయిన ప్రదేశం ఎక్కడం, మరుసటి రోజు దిగడంతో అప్పటి నుంచే పర్వతాలు అధిరోహించాలనే కోరిక కృష్ణకుమార్‌లో బలంగా పుట్టింది. అప్పటి నుంచి ట్రెక్కింగ్ ప్రారంభించాడు. కృష్ణకుమార్ లక్ష్య సాధనకు ఆయన తల్లిదండ్రులు బీవీ స్వామి, రాజరాజేశ్వరితో పాటు కాకినాడకు చెందిన విశ్రాంత బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి మంతా కామేశ్వరరావు, శ్రీహరి దంపతులు ప్రోత్సాహంతో పాటు ఆర్థిక తోడ్పాటు అందజేస్తున్నారు.
ఎవరెస్ట్ కల
నెరవేర్చుకుంటా..
పర్వతారోహణ సాహసంతో కూడికున్నది. ప్రకృతి ఒడిలో అందాలతో కనువిందు చేసే హిమాలయ పర్వతాలు ట్రెక్కింగ్ చేశాను. ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతం అధిరోహించడం కల. ఈ పర్వతం 28 వేల అడుగుల ఎత్తు. అంత సాహసం చేయలేం. ఎవరెస్ట్ బేస్ 22 వేల అడుగులు. దానిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. రెండేళ్లలో సాధించేలా ప్రణాళిక వేసుకున్నాను.
– దవులూరి కృష్ణకుమార్, కాకినాడ


