టిడ్కో ఇళ్లకు ప్రైవేట్ ఫైనాన్స్ వద్దు
సామర్లకోట: స్థానిక టిడ్కో సముదాయంలో నివాసం ఉంటున్న అనేక మందికి ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా రుణాలు ఇప్పించడానికి ఏర్పాట్లు చేయడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు సామర్లకోట మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తమకు ఆ రుణాలు వద్దంటూ మున్సిపల్ కమిషనర్‌ను చుట్టుముట్టారు. స్థానిక ఉప్పువారి సత్రం ఎదురుగా సుమారు 1,056 టిడ్కో గృహాలను నిర్మించారు. ఇందులో 350 మంది లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు మంజూరు కాలేదు. వారికి రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వ బ్యాంకులు ముందుకు రాకపోవడంతో ప్రైవేట్ ఫైనాన్స్ ఒప్పందం చేశారు. అయితే ప్రైవేట్ ఫైనాన్స్ వల్ల ఇబ్బందులు ఏర్పడతాయని, దానికి ఒప్పుకొనేది లేదంటూ లబ్ధిదారులు ఆందోళన చేశారు. అలాగే బ్యాంకుల నుంచి రూ.లక్ష, రూ.50 వేల ప్లాట్లకు సంబంధించి బ్యాంకు అధికారులు వాయిదాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, అనేక మందికి ప్లాట్లు అప్పగించకుండా వాయిదాలు ఏవిధంగా చెల్లిస్తామని ప్రశ్నించారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్ ఎ.శ్రీవిద్య మాట్లాడుతూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రద్దు చేసే అవకాశం లేదని, అలాగే ప్రైవేట్ ఫైనాన్స్‌కు 27 మంది ముందుకు వచ్చారని తెలిపారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళతామని వివరించారు.


