ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ విడుదల
రాయవరం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా నిర్వహించే పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆ విద్యాపీఠం డైరెక్టర్ ఆర్.నరసింహారావు శుక్రవారం విడుదల చేశారు. పరీక్ష ఫీజుల షెడ్యూల్‌ను గత నెలలోనే విడుదల చేయగా, పరీక్ష ఫీజును అపరాధ రుసుం లేకుండా ఈ నెల 10వ తేదీలోగా చెల్లించాలి. ఈ నెల 11, 12 తేదీల్లో సబ్జెక్టుకు రూ.25 అపరాధ రుసుంతో చెల్లించవచ్చు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సబ్జెక్టుకు రూ.50 అపరాధ రుసుంతో చెల్లించడానికి అవకాశముంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి ప్రవేశానికి 4,314 మంది, ఇంటర్‌లో చేరేందుకు 12,220 మంది అడ్మిషన్ ఫీజు చెల్లించారు. వీరంతా పరీక్ష ఫీజును చెల్లించాలి. రెగ్యులర్ పదో తరగతి, ఇంటర్ విద్యార్థులతో పాటు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కూడా అదే సమయంలో పరీక్షలు నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్థులకు మార్చి 16 నుంచి 28 వరకూ, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలు మార్చి 2 నుంచి 13వ తేదీ వరకు జరుపుతారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉంటాయి.


