సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిశీలన
కాకినాడ లీగల్: కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం రిజిస్ట్రేషన్ చేసిన దస్తావేజులను స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్ర ఐజీ బీఆర్ అంబేద్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం, కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సందర్శించానన్నారు. దస్తావేజుల్లో వివరాలను ఆన్‌లైన్‌లో ఉన్న వివరాలతో పరిశీలించారు. స్కాన్ చేసిన పాత దస్తావేజు రికార్డుల పరిశీలన ఎంత వరకూ వచ్చిందని ఆయన అడిగారు. ఆ దస్తావేజులను పరిశీలిస్తున్నామని జిల్లా రిజిస్ట్రార్ జేఎన్‌యూ జయలక్ష్మి తెలిపారు. విద్యుత్ అంతరాయం సమయంలో ఇన్వర్టర్లు పనిచేయక పోవడంతో స్లాట్ బుకింగ్ ముగిసిపోయి క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారని అంబేద్కర్‌ను విలేకరులు అడగ్గా, ఆ సమయానికి స్లాట్ బుకింగ్ ముగిసిపోకుండా త్వరలో సాఫ్ట్‌వేర్‌లో మార్పు చేస్తామని బదులిచ్చారు.
కార్యక్రమంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ సీహెచ్ జానకీదేవి, కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు–1, 2 ఆర్‌వీ రామారావు, ఎస్‌వీఎస్‌ఎస్ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తరచూ విద్యుత్ అంతరాయంతో ఇన్వర్టర్లు పని చేయకపోతే ముందుగా ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి ఇబ్బందులు వస్తున్నాయి. స్లాట్ బుకింగ్ ముగిసిపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయని విలేకరులు ఆ శాఖ డీఐజీని అడిగారు. దీనిపై జానకీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయని, వాటికి టెండర్ ద్వారా ఇన్వర్టర్లు, కంప్యూటర్లు, స్కానర్లు త్వరలో వస్తాయన్నారు. క్రయవిక్రయదారులు సమస్యలపై విలేకరులు అడగ్గా, సమాధానం చెప్పడానికి అసహనం వ్యక్తం చేశారు.


