సీఐటీయూ జాతీయ మహాసభలకు సన్నాహాలు
బోట్‌క్లబ్ (కాకినాడ): విశాఖపట్నంలో సీఐటీ యూ 18వ జాతీయ మహాసభలు ఈ నెల 31 నుంచి జనవరి నాలుగో తేదీ వరకూ జరుగుతా యని ఆ యూనియన్ నాయకులు తెలిపారు. స్థా నిక కలెక్టరేట్ వద్ద మహాసభల పోస్టర్‌ను మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ శుక్రవారం ఆవిష్కరించారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత, స్కీం వర్కర్ల సమస్యలు, కనీస వేతనం రూ.26 వేలు సాధించేందుకు తీర్మానాలు చేయనున్నట్లు వివరించారు. కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్‌లను తిప్పికొట్టేందుకు చర్చించనున్నట్లు వెల్లడించారు. జనవరి 4న విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో జరిగే భారీ బహిరంగ సభకు కాకినాడ జిల్లా నుంచి కార్మిక వర్గం తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. సంఘ వర్కింగ్ కమిటీ సభ్యుడు పలివెల వీరబాబు, నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, టి.రాజా, శ్రీనివాస్, శేఖర్, భారతీప్రియ, మేడిశెట్టి రాంబాబు పాల్గొన్నారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్ : రూ.3,11,500 సొత్తు స్వాధీనం
తుని రూరల్: తుని రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై అనుమానంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.3,11,500 సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు జీఆర్పీ పోలీసులు తెలిపారు. శుక్రవారం కాకినాడ లైన్ ఇన్‌స్పెక్టర్ టి.శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో తుని ఇన్‌స్పెక్టర్ జి.శ్రీనివాసరావు, హెచ్‌సీ పి.శ్రీనివాసరావు తమ సిబ్బంది, రాజమహేంద్రవరం ఆర్పీఎఫ్ క్రైం ఎస్సై సతీష్, ఏఎస్సై గోవిందరావులు రైళ్లలో నేరాలు అదుపునకు ఒకటో నంబరు ప్లాట్‌ఫామ్‌పై తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న కాకినాడకు చెందిన గుత్తుల వీరబాబు, పాయకరావుపేట మండలం మంగరం గ్రామానికి చెందిన సేనాపతుల మనీష్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరస్తులుగా గుర్తించి విచారించి మోటార్‌సైకిల్, 13.5 గ్రాముల బంగారు నగలు, మూడు సెల్ ఫోన్లు, రూ.40,500 నగదు మొత్తం రూ.3,11,500 సొత్తును రికవరీ చేసినట్టు జీఆర్పీ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. నేరాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశామన్నారు.


