చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఎన్నికల్లో నిరుద్యోగులు, రైతులు, విద్యా రంగానికి కూటమి నేతలు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కావడం లేదని అన్నారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలిస్తామని చెప్పారని, ఏడాదిన్నర అవుతున్నా ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. దీనికోసం బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు పేదలకు ఇళ్లు కట్టిస్తానని చెప్పి, నిర్మించిన ఇళ్లను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారని, దీనివలన పూర్తయిన ఇళ్లు కూడా లబ్ధిదారులకు అందని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కనీసం ఇప్పటికే కట్టిన టిడ్కో ఇళ్లనైనా వెంటనే పేదలకు అందించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లపై కూటమి ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల సమయంలో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడిన నాయకులు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై రూ.12 వేల కోట్ల పైచిలుకు భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. రాత్రి 10 గంటల తర్వాత ఫ్యాన్ తిరిగిందన్న కారణానికే అదనపు బిల్లులు విధించడం ప్రజలపై అదనపు భారం మోపడమేనని మండిపడ్డారు. రోజుకు 14 గంటల పని వంటి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం కొత్త బానిసత్వపు వైఖరి అని ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు దీర్ఘకాల పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటిగా హరిస్తున్నారని ఆవేదన చెందారు. అంతర్జాతీయ కార్మిక చట్టాల ఉల్లంఘనకు గానీ, కార్మికులతో ఎక్కువ గంటలు పని చేయించే వ్యవస్థకు గానీ సీపీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని స్పష్టం చేశారు. పెట్టుబడుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ లోకేష్‌పై విమర్శలు గుప్పించారు. విదేశీ పర్యటనలు చేస్తూ, పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నా, రాష్ట్రంలో ఒక్క పెద్ద పరిశ్రమయినా ప్రారంభమైందా? ఒక్క కొత్త ప్రాజెక్టు వచ్చిన ఆధారం ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
గ్రామ గ్రామానా నెలకొన్న ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి పోరాటాలు చేయాలని, తద్వారా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలు జనవరి 18న ఖమ్మంలో జరుగుతాయన్నారు. పార్టీ శతాబ్దిక పోరాట గాథలు, కార్మిక, రైతు ఉద్యమాల్లో చేసిన త్యాగాలను స్మరించుకునేలా నిర్వహించే ఈ ఉత్సవాలకు భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి రేఖ భాస్కరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు వి.కొండలరావు, పి.లావణ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రజా సమస్యలపై పోరాడాలి
ఫ సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు తరలి రావాలి
ఫ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపు


