అత్యంత సూక్ష్మమైనది ధర్మాధర్మ వివేచన
ఆల్కాట్ గార్డెన్స్ (రాజమహేంద్రవరం రూరల్) : సత్పురుషుల ధర్మాధర్మ వివేచన అత్యంత సూక్ష్మమైనదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యాన స్థానిక హిందూ సమాజంలో తొమ్మిదో రోజు వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన శుక్రవారం కొనసాగించారు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుని పుట్టుకలను వివరించారు. ‘విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు సంతానరహితులుగా కన్నుమూశారు. నాటి శిక్షాస్మృతిననుసరించి రాచరిక పాలన అనువంశికంగా వచ్చేది. రాజు లేకపోతే అరాచకం వ్యాప్తి చెందుతుంది. ధర్మం నశిస్తుంది. ఈ కారణం చేతనే అంబిక, అంబాలికలకు సంతానం ప్రసాదించాలని భీష్ముడిని సత్యవతి అడుగుతుంది. అందుకు భీష్ముడు అంగీకరించకపోవడంతో ఆమె స్మరణ మాత్రం చేత వ్యాసుని రప్పించి, తన కోడళ్లకు సంతానం ప్రసాదించాలని కోరుతుంది. ఒక సంవత్సరం పాటు వారిద్దరు ఒక వ్రతం పాటిస్తే, తాను సంతానాన్ని ప్రసాదిస్తానని వ్యాసుడు అన్నాడు. సత్యవతి వెంటనే ఈ పని కావాలని ఆదేశిస్తుంది. అంబికను కలవాలని ఏకాంత మందిరంలోకి వ్యాసుడు వెళ్లినప్పుడు ఆమె భయంతో కళ్లు మూసుకుంటుంది. అసహ్యంతో కాదని మనం గుర్తించాలి. పది వేల ఏనుగుల బలం కలవాడు, విద్వాంసుడు, రాజర్షి అయిన కుమారుడు ధృతరాష్ట్రుడు జన్మించాడు. కానీ, మాతృదోషం వలన అంధునిగా పుట్టాడు. అంబాలిక వద్దకు వెళ్తే, ఆమె వ్యాసుని చూసి తెల్లబోయింది. ఫలితంగా పాండు వర్ణంతో పాండురాజు పుడతాడు. ఈ సందర్భంగా కొందరు అనువాదకులు పాండురోగంతో పుట్టాడని వర్ణించడం ఘోరమైన తప్పిదం. రోగి రాజు కాలేడు. పాండురాజు ఎటువంటి రోగంతోనూ పుట్టలేదు. అంబాలిక తన దాసిని అలంకరించి పంపినప్పుడు, ఆ దాసి సంతోషంతో వ్యాసుని సేవించినందున ధర్మజ్ఞుడయిన విదురుడు జన్మించాడు. ధర్మశాస్త్రాల పట్ల సరైన అవగాహన లేనివారు, జనరంజకత్వం కోసం రచనలు చేసేవారు భారతం పట్ల కువ్యాఖ్యానాలు చేయడం పరిపాటి అయింది. వాడిదే కులం, వీడిదే కులం అని సినీ రచనలు చేసేవారు తీవ్రమైన దోషానికి పాల్పడుతున్నారు’ అని సామవేదం అన్నారు. మనుధర్మ స్మృతి, ఆపస్తంభ సూత్రాలను అనుసరించి అనేక ధర్మరహస్యాలను ఆయన వివరించారు. ‘పరాశరుని ద్వారా సత్యవతికి జన్మించిన వ్యాసుడు విప్రుడయ్యాడు. వ్యాసుని ద్వారా అంబిక, అంబాలికలకు పుట్టిన వారు క్షత్రియులయ్యారు. ఇక్కడ ధర్మశాస్త్రాలు బీజ ప్రాధాన్యం, క్షేత్ర పాధాన్యం అనే రెండు అంశాలు పేర్కొంటున్నాయి. వీటి ప్రకారం ప్రకారం వ్యాసుడు విప్రుడు, ఆయన ద్వారా అంబిక, అంబాలికలకు జన్మించిన వారు క్షత్రియులు అయ్యారు’ అని సామవేదం చెప్పారు.


