రైతులందరికీ యూరియా అందుతుంది
బిక్కవోలు: మండలంలోని ఊలపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్‌లో శుక్రవారం ప్రచురించిన ‘యూరియా కోసం బారులు’ వార్తకు వ్యవసాయ అధికారులు స్పందించారు. అనపర్తి సహాయ వ్యవసాయ సంచాలకుడు డీవీ కృష్ణ, రాజమహేంద్రవరం సహాయ పౌర సరఫరాల అధికారి ఎం.నాగాంజనేయులు, మండల వ్యవసాయ శాఖ అధికారి ఎన్.శామ్యూల్ జాన్ తదితరులు ఆ సొసైటీకి శుక్రవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ, ఊలపల్లి గ్రామంలో పంట కాలం పూర్తయ్యేలోగా మూడు దఫాలుగా వేయడానికి 260 టన్నుల యూరియా అవసరమవుతుందని చెప్పారు. ఇప్పటి వరకూ 40 టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు. రైతులకు ఎకరానికి ఒక బస్తా యూరియా ఇవ్వాలని సొసైటీ పాలకవర్గం నిర్ణయించి, ఆ మేరకు పంపిణీ మొదలు పెట్టిందన్నారు. ప్రతి రైతూ ఈ–పోస్ యంత్రంలో వేలిముద్రలు వేసి, యూరియా తీసుకోవాల్సి వస్తూండటంతో కొంత ఆలస్యం జరిగిందని చెప్పారు. యూరియాకు ఎటువంటి ఇబ్బందులూ లేవని, రైతులు సంయమనం పాటించాలని కోరారు. ఈ నెల రెండో వారం నుంచి అన్ని సొసైటీల్లోనూ అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రైతులందరికీ యూరియా అందుతుంది


