‘ఉచితా’నికి కొత్త బస్సులు కొనాలి
నిడదవోలు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఆర్టీసీలో వెంటనే 3 వేల బస్సులు కొనాలని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ జోనల్ కార్యదర్శి వైఎస్ రావు డిమాండ్ చేశారు. పట్టణంలోని షాదీఖానాలో యూనియన్ నిడదవోలు డిపో అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం అన్ని కేటగిరీల్లో ఉన్న 10 వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగులకు పని ఒతిడ్తి తగ్గించాలని, డివిజన్ స్థాయి సీనియారిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించి అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. బస్సులు, సిబ్బందిని పెంచకుండా ఉచిత బస్సు పథకం నిర్వహణ చాలా కష్టమవుతోందని చెప్పారు. సీ్త్రశక్తి బస్సులలో డ్యూటీలకు వెళ్లాలంటేనే కండక్టర్లు, డ్రైవర్లు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. డ్యూటీలో ఉన్న సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని రావు అన్నారు. యూనియన్ జిల్లా కార్యదర్శి జి.చిరంజీవి మాట్లాడుతూ, నిడదవోలు డిపోలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జోనల్ సంయుక్త కార్యదర్శి ఎస్‌కే మీరా, జిల్లా కార్యవర్గ సభ్యులు ముస్తఫా, ఎంఎస్ ప్రసాద్, బి.అప్పారావు, పీఎస్ మన్యం, రామకృష్ణ, నారాయణ, ఎస్.సత్తిబాబు, మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో
పలువురికి పదవులు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని పార్టీ అనుబంధ విభాగాల్లో వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గుత్తుల మురళీధర్ (రాజమండ్రి సిటీ) బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కాటం రజనీకాంత్‌ను ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, గారా చంటిబాబును ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా, హసీనా బేగాన్ని మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, వట్టికూటి కృష్ణవేణిని రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా నియమించారు. అప్పారి జయప్రకాష్(రాజమహేంద్రవరం రూరల్)ను వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా జక్కుల మహేష్, డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడిగా యలమంచిలి నాగరాజు, ఇంటలెక్చువల్స్ ఫోరమ్ అధ్యక్షుడిగా అల్లు జయరాజ్, లీగల్ సెల్ అధ్యక్షుడిగా కంఠస్ఫూర్తి శ్రీనివాసరాజు; వైఎస్సార్ టీఎఫ్ గోపాలపురం, కొవ్వూరు, రాజానగరం, రాజమండ్రి సిటీ నియోజకవర్గాల అధ్యక్షులుగా గోతమ్ సత్యలక్ష్మి, ధర్మగిరి, అనకాపల్లి ఆర్‌కేఎస్ శివప్రసాద్, పతివాడ రమేష్‌బాబు నియమితులయ్యారు.
లావాదేవీలు జరగని ఖాతాల్లో సొమ్ము పొందవచ్చు
అమలాపురం రూరల్: మీ డబ్బు.. మీ హక్కు కార్యక్రమంలో భాగంగా పదేళ్ల పైబడి నిరుపయోగంగా ఉన్న బ్యాంక్ ఖాతాల్లో ఇన్సూరెన్స్, షేర్ మార్కెట్లో ఉన్న సొమ్మును తిరిగి హక్కుదారులు పొందవచ్చని ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ అశోక్ నాగరాజన్ తెలిపారు. శుక్రవారం అమలాపురం కలెక్టర్ గోదావరి భవన్‌లో బ్యాంకర్లు, ఇన్సూరెన్స్, షేర్ మార్కెట్ కంపెనీ ప్రతినిధులతో ఎల్‌డీఎం కేశవవర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రజలు మర్చిపోయిన లేదా క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక ఆస్తులను తిరిగి పొందేలా సహాయం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కేశవవర్మ మాట్లాడుతూ లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లో సొమ్ము ఇచ్చే ప్రయత్నం చేయాలని కేంద్రం ఆదేశించిందన్నారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 4,70,690 నిరుపయోగంగా ఉన్న బ్యాంకు ఖాతాల్లో రూ 82.66 కోట్ల మేర నిధులు ఉన్నట్లు గుర్తించామన్నారు.
‘ఉచితా’నికి కొత్త బస్సులు కొనాలి


