రైతులకు రాళ్ల దెబ్బలు!
● మరమ్మతులకు ప్రతిపాదనలు
రాళ్ల డ్రెయిన్ మరమ్మతులకు తగిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. సుమారు ఏడు కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉంది. నిధులు మంజూరైన వెంటనే మెషనరీతో పనులు చేపడతాం. – రేష్మ, డ్రెయిన్స్ ఏఈ, రాజోలు
● మరమ్మతులు చేపట్టాలి
తీరప్రాంతాల్లోని గ్రామాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న రాళ్ల డ్రెయిన్‌కు చాలా కాలంగా మరమ్మతులు లేవు. దీనికి మరమ్మతులు త్వరగా చేపడితే రైతులకు, ప్రజలకు ఎంతో ఊరట కలుగుతుంది. మరమ్మతులు లేకపోవడంతో మురుగు నీటితో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.
– రావి ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ, అంతర్వేదికర
● పూడికతీత పనుల్లో జాప్యం
రాళ్ల డ్రెయిన్ పూడికతీత పనుల్లో జాప్యం వల్ల వర్షాలకు డ్రెయిన్ పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో రోజుల తరబడి ముంపు నీరు నిలిచి నివాసితులు అవస్థలు పడుతున్నారు. వెంటనే పనులు చేపట్టాలి.
– గుండుబోగుల సూర్యనారాయణ,
రైతు, అంతర్వేది దేవస్థానం
● డ్రెయిన్‌కు మరమ్మతులు లేక అవస్థలు
● మూడు గ్రామాలకు అనసంధానం
● వెనక్కు పోటెత్తుతున్న ముంపు నీరు
● మరమ్మతుల్లో జాప్యంతో అన్నదాత ఆవేదన
సఖినేటిపల్లి: తీరప్రాంత గ్రామాల్లోని ఆయకట్టు భూముల్లో మురుగు నీటిని దించే రాళ్ల డ్రెయిన్ మరమ్మతుల్లో జాప్యంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుచూ కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో నిచిపోతున్న ముంపు నీరు దిగడానికి ఈ డ్రెయిన్ ఆధారంగా ఉండడంతో ప్రజలు సైతం నానా అవస్థలు పడుతున్నారు.
ఈ డ్రెయిన్ కేశవదాసుపాలెం, అంతర్వేదికర, అంతర్వేది దేవస్థానం, పల్లిపాలెం గ్రామాలకు అనుసంధానంగా విస్తరించి ఉంది. ఈ గ్రామాల మీదుగా సుమారు పది కిలోమీటర్లు మేర మైనర్ డ్రెయిన్ ప్రవహిస్తోంది. కేశవదాసుపాలెం నుంచి మొదలయ్యే ఈ డ్రెయిన్ చిట్ట చివరిగా అంతర్వేది ఏటిగట్టు వద్ద తెరుచుకుని వశిష్ట గోదావరి వైపు మళ్లుతుంది. కాగా కేశవదాసుపాలెం, అంతర్వేదికర గ్రామాల్లోని సుమారు మూడు వేల ఎకరాల ఆయకట్టు భూముల్లో మురుగు నీరు దిగడానికి, ఈ రెండు గ్రామాలతో పాటు అంతర్వేది దేవస్థానం, పల్లిపాలెం గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలకు నిలిచిపోతున్న ముంపు నీరు దిగడానికి ఈ డ్రెయిన్ ఎంతగానో దోహదపడుతుంది.
డ్రెయిన్‌లో పూడిక తీయాలి
కేశవదాసుపాలెం నుంచి అంతర్వేది ఏటిగట్టు వరకూ సుమారు పది కిలోమీటర్ల పొడవున డ్రెయిన్ విస్తరించి ఉంది. డ్రెయిన్ పొడవునా కిలోమీటర్ల మేర పూడిక ఉండడంతో వర్షాలకు డ్రెయిన్ పొంగి పొర్లుతోందని రైతులు చెప్తున్నారు. ఈ పూడిక మట్టిని మెషీన్ ద్వారా వెలికి తీయాల్సి ఉందని, డ్రెయిన్‌కు మరమ్మతులు చేపట్టడం ద్వారా అటు రైతులకు, ఇటు ప్రజలకు మేలు చేకూరుతుందని వారు అంటున్నారు.
దేవస్థానం భూమిని ఆనుకుని
రాళ్ల డ్రెయిన్‌కు ఆనుకుని అంతర్వేది లక్ష్మీనృసింహుని ఆలయానికి తూర్పు వైపు సమారు 35 ఎకరాల భూమి ఉంది. డ్రెయిన్ ద్వారా పోటెత్తుతున్న ఉప్పునీరు ఈ భూములను కూడా ముంచెత్తుతోంది. ఈ భూములకు రక్షణ కల్పించడానికి కూడా డ్రెయిన్‌కు మరమ్మతులు చేపట్టాల్సి ఉందని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతులకు రాళ్ల దెబ్బలు!


