ఓంకార సాధనతో ఆధ్యాత్మిక చింతన
● ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఉమర్ ఆలీషా
● కొప్పవరం ప్రణవాశ్రమంలో
దేశ, విదేశీ భక్తుల సమాగమం
● అలరించిన నృత్య ప్రదర్శనలు
సామర్లకోట: ఓంకార సాధన ద్వారా మనిషిలో ఆధ్యాత్మిక చింతన, తద్వారా సేవాభావం అలవడతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉమర్ ఆలీషా అన్నారు. మండలం కొప్పవరం గ్రామంలో ప్రణవ ఆశ్రమంలో జరుగుతున్న శివలింగ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రణవాశ్రమంలోని ప్రశాంత వాతావరణం ఎంతో హృద్యంగా ఉందని, ఈ ప్రశాంతతలో ఓంకార సాధన చేస్తే మనిషిలో మార్పు వస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవన శైలి మార్పునకు ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలని ఆయన సూచించారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు సుమిత్రా నంద సరస్వతి మాతా ఉమర్ ఆలీషాను సత్కరించారు. ఈ మేరకు జర్మనీ, అమెరికా, కెనాడా దేశాలల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక వేత్తలు, మునులు, పీఠాధిపతులు, భక్తులను ఉమర్ ఆలీషా సత్కరించారు. ఈ సందర్బంగా సుమిత్రానంద సరస్వతి మాత మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా ఎన్నో వేల సత్సంగాలు, ఎంతో మంది ‘డిప్రెషన్’లో ఉన్న వారికి ఓంకారం ద్వారా సాంత్వన చేకూర్చినట్టు తెలిపారు. అమెరికాలో ప్రతి ఏటా వివిధ రాష్ట్రలలో ఓంకారం సాధన ద్వారా అనేక మందికి మానసిక ప్రశాంతత చేకూరుస్తున్నామన్నారు. ఓకారం నినాదం కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమం నిర్మాణానికి విదేశాల నుంచి వేలాది మంది భక్తులు విరాళాలు అందజేశారని, వారి ప్రోత్సాహంతో ప్రణవాశ్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మారుమూల ప్రాంతంలో ఆశ్రమం నిర్మాణం చేపట్టడం ద్వారా ఆహ్లాదకర వాతావరణంలో రాబోయే రోజులలో యువతీ, యువకులకు భారతీయ సంప్రదాయాలు, కట్టుబాట్లు జీవన శైలిపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో బాలికలు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టు కున్నాయి. కార్యక్రమంలో హృషికేశ్ నుంచి ఆర్ష విద్యాపీఠాధిపతి స్వామి తత్వ విద్యానంద సరస్వతి, స్వామి దుర్గానంద సరస్వతి, శివాలయ ఆశ్రమం స్వామి విజయానంద పురి మహారాజ్, స్వామి మేథానంద పురి హిమాలయన్ యోగి 110 సంవత్సరాల బాబా స్వామి సంతు సదానంద గిరి మహరాజ్, పుణ్యగిరి స్వామిజీ నిత్య తృప్తానంద సరస్వతి, కేరళ కై లాస ఆశ్రమం స్వామిని చంద్రానంద మాత, శ్రీలంక బౌద్ధ బిక్షువు డాక్టరు బోధి హీన్, తాళంకేరీ దత్త ఆశ్రమం శివస్వామి, తోటపల్లి, శాంతి ఆశ్రమం వినమ్రానంద సరస్వతి మాత, నిజామాబాద్ ప్రశాంత ఆశ్రమం నుంచి విశ్వాత్మానంద గిరి స్వామి, అరుణాచలం నుంచి శివ ప్రియానంద సరస్వతి, రాచపల్లి నుంచి రామస్వామి, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఓంకార సాధనతో ఆధ్యాత్మిక చింతన
ఓంకార సాధనతో ఆధ్యాత్మిక చింతన


