పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
రూ.5 వేల జరిమానా
అయినవిల్లి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ కాకినాడ ప్రత్యేక కోర్టు జడ్జి కె.శ్రీదేవి శుక్రవారం తీర్పు ఇచ్చారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, స్థానిక ఎస్సై హరికోటి శాస్త్రి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2018 ఆగస్టు ఏడో తేదీన అయినవిల్లి మండలం అయినవిల్లిలంక గ్రామం పిల్లివారిపేటకు చెందిన 15 ఏళ్ల బాలికపై ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన ముత్తాబత్తుల సతీష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి హెడ్ కానిస్టేబుల్ జె.సత్యనారాయణ పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం డీఎస్పీలు ఏవీఎల్ ప్రసన్నకుమార్, డీఎస్పీ ఆర్.రమణ, ఎస్‌కె మాసూం బాషా సమగ్ర దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. పబ్లిక్ ప్యాసిక్యూటర్లు కె.వెంకటరత్నం బాబు, పి.శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ తరఫున వాదించగా జడ్జి నిందితుడికి పై విధంగా తీర్పు ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు చేసిన అప్పటి అధికారులను, ప్రస్తుత కొత్తపేట ఏఎస్‌డీపీఓ ఎస్.మురళీ మోహన్, పి.గన్నవరం సర్కిల్ సీఐ రుద్రరాజు భీమరాజు, అయినవిల్లి ఎస్‌ఐ హరికోటి శాస్త్రి, సిబ్బందిని ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేకంగా అభినందించారు.
విజ్ కిడ్స్ ప్రీమియర్‌లీగ్‌లో లక్ష్యశ్రీ ప్రతిభ
రావులపాలెం: విజ్ కిడ్స్ కార్నివాల్ ఆధ్వర్యంలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన కిడ్స్ ప్రీమియర్ లీగ్ సీజన్–4 గ్రాండ్ ఫైనల్‌లో రావులపాలేనికి చెందిన కొవ్వూరి లక్ష్యశ్రీ రెండో స్థానం నిలిచినట్టు ఆమె తల్లిదండ్రులు మహాలక్ష్మి, సూర్యానారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. ఇటీవల పూణేలో జాతీయస్థాయిలో జరిగిన ప్రీమియర్ లీగ్‌లో మూడు అంశాల్లో హ్యాండ్ రైటింగ్, శ్లోకాలు, డ్యాన్స్ పోటీలలో జూనియర్ కేటగిరీలో రావులపాలేనికి చెందిన ఐదో తరగతి విద్యార్థిని కొవ్వూరి లక్ష్యశ్రీ పాల్గొని మూడు విభాగాల్లోనూ రెండో స్థానంలో నిలిచిందన్నారు. అలాగే ప్రముఖ విజ్ కిడ్స్ ఫౌండర్ అభిషేక్ అవధాని చేతుల మీదుగా మెమెంటోలు, ప్రశంసా పత్రాలు, నగదు బహుమతిని అందుకుందన్నారు.
భార్యపై అనుమానంతో ఇంటికి నిప్పు
భర్తపై హత్యాయత్నం కేసు నమోదు
అమలాపురం టౌన్: భార్యపై అనుమానంతో ఏకంగా ఇంటికే నిప్పు పెట్టి ఆమెను చంపేందుకు ప్రయత్నించిన జంగా శివ (సురేష్)పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి గ్రామం పోలేరమ్మ గుడి సందుకు చెందిన జంగా విజయ దుర్గా భవాని ఈ మేరకు తన భర్తపై ఫిర్యాదు చేసినట్టు సీఐ తెలిపారు. భవాని అదే గ్రామంలో తన తల్లి ఇంటి వద్ద పిల్లలతో ఉంది. పిల్లలతో ఆమె నిద్రిస్తుండగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఇంటిపై శివ పెట్రోలు పోసి నిప్పు పెట్టాడని సీఐ తెలిపారు. ఇల్లు పాక్షికంగా కాలిపోగా, అతని భార్య, పిల్లలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఎస్సై ఎన్‌ఆర్ కిషోర్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు


