చైన్‌లు తెంపి.. చెంగున ఉడాయించి..
● రోడ్డుపై వెళుతున్న మహిళలే అతని టార్గెట్
● ఆనవాలు తెలియకుండా మాస్క్‌లు, టోపీలు
● వాహనం నంబర్ ప్లేట్లు మారుస్తూ
చైన్ స్నాచింగ్
● ఆరు నేరాల్లో రూ.12.32 లక్షల సొత్తు రికవరీ
నిందితుడి వివరాలు వెల్లడించిన ఎస్పీ మీనా
అమలాపురం టౌన్: రహదారిలో స్కూటీలపై వెళ్తున్న మహిళలే అతని టార్గెట్. వారు కనిపిస్తే చాలు అతని చేతులు లాఘవం ప్రదర్శిస్తాయి. వెంటనే చటుక్కున మెడలో చైన్‌లు లాగేసి ఉడాయిస్తాడు. రెక్కీ నిర్వహించి మరీ నేరాలకు పాల్పడడంలో అతను దిట్ట. తన ఆనవాలు తెలియకుండా ముఖానికి మాస్క్.. తలకు టోపీ పెట్టుకుంటాడు. తాను నడిపే మోటారు సైకిల్‌ను గుర్తించకుండా నెంబర్ ప్లేట్లు మారుస్తూ నేరాలకు పాల్పడుతుంటాడు. నేరం చేసిన తర్వాత కొద్ది దూరం వెళ్లాక తాను వేసుకున్న డ్రెస్ కూడా మార్చేసి సాధారణ ప్రజానీకంలో కలసిపోతాడు. ఇదీ ఇతని నేరాల స్టయిల్. ఆరు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డ ఐ.పోలవరం మండలం గుత్తెనదీవికి చెందిన ప్రస్తుతం కాకినాడ వెంకటేశ్వర కాలనీ పార్కు వద్ద నివసిస్తున్న సాధనాల వెంకటేష్ చివరకు ద్రాక్షారామ పోలీసులకు చిక్కాడు. ద్రాక్షారామ పోలీసుల లోతైన దర్యాప్తుతో వెంకటేష్ నేరాల చిట్టా వెలుగు చూసింది. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుడు వెంకటేష్ చేసిన నేరాలను వివరించారు. అతని నుంచి రూ.12.32 లక్షల విలువైన 112.784 గ్రాముల బంగారు నగలను రికవరీ చేశారు. అలాగే నిందితుడు నేరాలకు ఉపయోగించే ఏపీ05 డీబీ 1709 నెంబర్ గల గ్లామర్ మోటార్ సైకిల్‌ను కూడా స్వాఽధీనం చేసుకున్నారు. రామచంద్రపురం డీఎప్పీ బి.రఘువీర్, సీఐ ఎం.వెంకట నారాయణ, ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్, రామచంద్రపురం ఎస్సై ఎస్.నాగేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఐదు బృందాలు.. 250 సీసీ కెమేరాల పరిశీలన
నిందితుడు వెంకటేష్‌ను వెంకటాయపాలెం వంతెన వద్ద శుక్రవారం పట్టుకున్నారు. ఇతని కోసం 250 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతని కోసం ఐ దు పోలీస్ బృందాలను నియమించడంతో వారు సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
నిందితుడి నేరాల చిట్టా
● 2023 మే 11న కాకినాడ సమీపంలో వలసలపాక గ్రామంలో స్కూటీపై వెళుతున్న మహిళ మెడలో బంగారు తాడు కాజేశాడు.
● 2023 మే 9న కాకినాడ–సామర్లకోట రోడ్డులో స్కూటీపై వెళ్తున్న మహిళ మెడలో బంగారు తాడు తెంపేసి దోచుకున్నాడు.
● 2025 మే 11న కరప మెయిన్ రోడ్డులో స్కూటీపై తల్లీకూతుళ్లు వెళుతుండగా వెనుక కూర్చున్న అమ్మాయి మెడలో బంగారు గొలుసు కాజేశాడు.
● 2025 మే 16న ద్రాక్షారామ దగ్గర వెంకటాయపాలెం దాటిన తర్వాత ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఇద్దరు మహిళలు స్కూటీపై వెళుతుండగా వాహనం నడుపుతున్న మహిళ మెడలో బంగారు మంగళ సూత్రాలను దొంగిలించాడు.
● 2025 జూన్ 24న వెంటూరు గ్రామ శివారు వంతెన వద్ద స్కూటీపై వెళుతున్న మహిళ మెడలో బంగారు తాడు కాజేశాడు.
● 2025 ఆగస్టు 20న ద్రాక్షారామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దాటిన తర్వాత స్కూటీపై వెళుతున్న మహిళ మెడలో బంగారు తాడును లాక్కున్నాడు.
పోలీస్ అధికారులకు రివార్డులు
కరుడు కట్టిన చైన్ స్నాచర్ వెంకటేష్‌ను డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో పట్టుకోవడమే కాకుండా రూ.12.32 లక్షల సొత్తును రికవరీ చేసిన సీఐ వెంకటనారాయణ, ఎస్సైలు లక్ష్మణ్, నాగేశ్వరరావు, హెచ్‌సీలు, కానిస్టేబుళ్లను ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేకంగా అభినందించారు. వారికి ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు.


