తడబడుతూ.. | - | Sakshi
Sakshi News home page

తడబడుతూ..

Nov 4 2025 7:28 AM | Updated on Nov 4 2025 7:28 AM

తడబడు

తడబడుతూ..

దేవరపల్లి: ఈ ఏడాది వర్జీనియా పొగాకు సాగు ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అనే రీతిలో తడబడుతూ సాగుతోంది. గత నెలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దీనికి తోడు మోంథా తుపాను ప్రభావంతో మరో నాలుగు రోజులు కురిసిన భారీ వర్షాలకు దుక్కులు తయారు కాక రైతులు పొగాకు సాగుకు వెనుకంజ వేశారు. కొంతమంది రైతులు ధైర్యం చేసి తుపానుకు ముందు నాట్లు వేశారు. అవి కాస్తా తుపాను ధాటికి తుడిచిపెట్టుకుపోయాయి. తోటల్లో వరద నీరు ప్రవహించడంతో ఇసుక మేటలు వేసి, మొక్కలు కూరుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం పొలాలను ముంచెత్తడంతో భూములు కోతకు గురై గాడ్లు పడ్డాయి. పలువురు రైతులు పడిపోయిన మొక్కలను నిలబెట్టి, కొంత వరకూ కాపాడుకున్నారు. కొంత మంది పూర్తిగా దెబ్బ తిన్న తోటలను దున్ని మళ్లీ నాట్లు వేస్తూండగా.. మరి కొంత మంది నాట్లు వేయడానికి దుక్కులు చేస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే ఈ వారంలో నాట్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

రూ.8 వేల అదనపు పెట్టుబడి

మోంథా తుపానుకు ముందు రైతులందరూ పొగాకు నాట్ల కోసం దుక్కులు సిద్ధం చేసి, డ్రిప్‌ పైపులు ఏర్పాటు చేశారు. నారు సిద్ధం చేసుకుని నాట్లు వేద్దామనుకున్న తరుణంలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. దీంతో, సిద్ధం చేసిన దుక్కులు పనికి రాకుండా పోయాయి. రెండు రోజులుగా ఎండలు కాస్తూండటంతో రైతులు మళ్లీ దుక్కులు సిద్ధం చేస్తున్నారు. రెండోసారి దుక్కులు దున్ని, డ్రిప్‌ పైపులు ఏర్పాటు చేయడానికి ఎకరాకు సుమారు రూ.8 వేలు అదనంగా ఖర్చవుతుందని వాపోతున్నారు. వేసిన తోటలను దున్ని మళ్లీ వేయడానికి ఎకరాకు దాదాపు రూ.10 వేలు అవుతుందని చెబుతున్నారు. ముందుగా వేసిన తోటల్లో 20 శాతం మొక్కలు చనిపోయాయి. వాటి స్థానంలో కొత్త మొక్కలు వేస్తున్నారు. ఎగువ ఉత్తర తేలిక నేలల ప్రాంతమైన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, దిగువ ఉత్తర తేలిక నేలల ప్రాంతమైన గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల పరిధిలో తుపానుకు ముందు సుమారు 1,050 హెక్టార్లలో నాట్లు వేశారు. దీనిలో 20 నుంచి 30 శాతం తోటలు దెబ్బ తిన్నాయని రైతులు చెబుతున్నారు. ఉన్న మొక్కలు కూడా కోలుకోవడం కష్టమేనని అంటున్నారు.

నాట్లు జాప్యం

సాధారణంగా నవంబర్‌ మూడో వారం నాటికి పొగాకు నాట్లు పూర్తి కావాలి. కానీ, అధిక వర్షాలు, మోంథా తుపాను ప్రభావంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ నాట్లే పడలేదు. ప్రతి ఏడాది కంటే ఈసారి నాట్లు సుమారు 20 రోజులు ఆలస్యమైనట్టు రైతులు తెలిపారు. దీని వలన దిగుబడి తగ్గుతుందని నిరాశగా చెబుతున్నారు. మరోవైపు నాట్లు ఆలస్యం కావడం వల్ల మడుల్లోని నారు ముదిరిపోతుందని గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే నాలుగైదుసార్లు మొక్కల ఆకులు తుంచామని పలువురు రైతులు చెప్పారు. అందరూ ఒకేసారి నాట్లు ప్రారంభిస్తే నారుకు డిమాండ్‌ పెరిగి, దాని ధరకు రెక్కలొస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ట్రే నారు ఎకరం రూ.7 వేలు, మడుల్లో నారు రూ.4 వేలు పలుకుతోంది. వాతావరణం అనుకూలిస్తే ఈ నెలాఖరుకు పూర్తవుతాయని అధికారులు అంటున్నారు. అయితే, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా మంగళవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనిపై ఆందోళన చెందుతున్న రైతులు పొగాకు నాట్లు వేయాలా.. వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు.

సాగు విస్తీర్ణం పెరిగే చాన్స్‌

రాజమహేంద్రవరం రీజియన్‌లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో గత ఏడాది అధికారికంగా 29,480 హెక్టార్లలో (సుమారు 72,847 ఎకరాలు) పొగాకు సాగు చేశారు. అనధికారిక లెక్కల ప్రకారం సుమారు 80 వేల ఎకరాల్లో సాగు జరిగినట్టు అంచనా. 2025–26 పంట కాలంలో కూడా పొగాకు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది కిలో పొగాకు ధర రికార్డు స్థాయిలో రూ.455 పలికింది. దీంతో, రైతులకు మంచి లాభాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదికి సాగు విస్తీర్ణం 90 వేల ఎకరాలు దాటుతుందని అధికారులు భావిస్తున్నారు. బ్యారన్‌కు 1.75 హెక్టార్ల విస్తీర్ణంలో 35.15 క్వింటాళ్ల ఉత్పత్తికి మాత్రమే బోర్డు అనుమతించింది. గత ఏడాది కంటే బ్యారన్‌కు 10 క్వింటాళ్ల ఉత్పత్తి తగ్గించారు.

ముదిరిపోతున్న నారు

తుపానుకు దెబ్బ తిన్న పొగాకు తోట

అనుకూలించని వాతావరణం

ముందుకు సాగని వర్జీనియా

పొగాకు సాగు

ఆలస్యమవుతున్న నాట్లు

రీజియన్‌లో సాగు విస్తీర్ణం

29,480 హెక్టార్లు

ఇప్పటి వరకూ 1,050

హెక్టార్లలోనే నాట్లు

మోంథా తుపానుతో దెబ్బ తిన్న తోటలు

తడబడుతూ..1
1/2

తడబడుతూ..

తడబడుతూ..2
2/2

తడబడుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement