రత్నగిరి.. భక్తఝరి
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది
6 వేల వ్రతాలు
● రూ.50 లక్షల ఆదాయం
అన్నవరం: కార్తిక సోమవారం కావడంతో వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి కిటకిటలాడింది. సత్యదేవుని దర్శనానికి భక్తులు ఉదయం నుంచీ తండోపతండోపాలుగా తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 6 వేలు జరిగాయని అధికారులు తెలిపారు. స్వామివారి నిత్య కల్యాణంలో 27 మంది భక్తులు రూ.1,116 చొప్పున టికెట్లు కొనుగోలు చేసి పాల్గొన్నారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు చెప్పారు. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. సుమారు 6 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు.
ఆశించిన మేరకు జరగని వ్రతాలు
కార్తిక సోమవారం సందర్భంగా స్వామివారి వ్రతాలు 8 వేల నుంచి 10 వేల వరకూ జరుగుతాయని దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ, ఆ మేరకు జరగకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అయితే, కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావిస్తున్నారు. ఆ రోజు 10 వేలకు పైగా వ్రతాలు జరుగుతాయని భావిస్తూ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు వేకువజామున ఒంటి గంటకే సత్యదేవుని వ్రతాలు ప్రారంభిస్తారు. స్వామివారి దర్శనానికి కూడా భక్తులను తెల్లవారుజామును 2 గంటల నుంచే అనుమతిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బుధవారం సత్యదేవుని అంతరాలయ దర్శనం, యంత్రాలయం దర్శనాలను నియంత్రించనున్నారు.
ఆలయ సమీపాన మరో
రూ.1,500 వ్రత మండపం
సత్యదేవుని వ్రతాలు రూ.1,500 టికెట్టుపై ఆచరించేవారు ఎక్కువగా ఉంటున్నారు. వారికి రెండు మండపాలు మాత్రమే ఉన్నాయి. అనివేటి మండపంలోని ధ్వజస్తంభం వద్ద మాత్రమే ఈ వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఒక బ్యాచ్‌లో 200 మంది మాత్రమే రూ.1,500 వ్రతమాచరించే వీలుంది.
దీంతో మిగిలిన వారు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. కార్తిక పౌర్ణమి నాడు రూ.1,500 వ్రతాలు ఆచరించేవారి కోసం స్వామివారి ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న మండపం మీద తాత్కాలికంగా షెడ్డు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తిక పౌర్ణమి నాడు రూ.1,500 వ్రతాలు నిర్వహించే పురోహితులకు ఆ మేరకు ఆదేశాలిచ్చామని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
