సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా డాక్టర్ పచ్చిమాల వీర వెంకట సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు వైద్య విద్య సంచాలకుడు రఘునందన్ గంభీర సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. ఇప్పటి వరకూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా కొనసాగిన డాక్టర్ సౌభాగ్యలక్ష్మి గత నెలాఖరున ఉద్యోగ విరమణ చేశారు. ఆ స్థానంలో సత్యనారాయణ నియమితులయ్యారు. ఆయన అదే ఆస్పత్రిలో రెండేళ్లుగా జనరల్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్, హెచ్‌ఓడీ హోదాలో కొనసాగుతున్నారు. సత్యనారాయణ 1983 బ్యాచ్ కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) విద్యార్థి. అదే కళాశాలలో 1996లో మెడిసిన్‌లో పీజీ పూర్తి చేశారు. తొలి పోస్టింగ్ 1999లో ఆర్‌ఎంసీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా లభించింది. 2006లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగోన్నతి పొంది, 2012 వరకూ కొనసాగారు. అప్పటి నుంచి 2015 వరకూ కార్డియాలజీ విభాగంలో అసోసియేట్, ప్రొఫెసర్ హోదాల్లో పని చేశారు. 2016 నుంచి 2017 మధ్య ఏడాది పాటు కాకినాడ జీజీహెచ్‌లో సీఎస్ ఆర్‌ఎంఓగా పని చేశారు. 2023 వరకూ పేరెంట్ డిపార్ట్‌మెంట్ జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ హోదాలో కొనసాగారు. రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో కొన్ని రోజుల పాటు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా పని చేశారు. 26 ఏళ్ల వృత్తి జీవితంలో 10 మంది కలెక్టర్ల నుంచి ఉత్తమ వైద్యుడిగా అవార్డులు అందుకున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమితులైన పీవీవీను కాకినాడ ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్, ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వైద్యాధికారులు, సిబ్బంది, వివిధ సంఘాల నేతలు అభినందించారు.
ఎస్టీ బాలికల హాస్టళ్లు
ఏర్పాటు చేయాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో ఎస్టీ హాస్టళ్లు అదనంగా ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం నాయకులతో కలసి కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ కీర్తికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎస్టీ బాలికల హాస్టళ్లలో సీట్లు నిండిపోయాయని, దీంతో, డిగ్రీ రెండో కౌన్సెలింగ్‌లో వచ్చిన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. నేటి నుంచి డిగ్రీ 3వ కౌన్సెలింగ్ సీట్లు విడుదలవుతాయని, ఆ విద్యార్థులకు కూడా హాస్టల్ సీట్లు అవసరమవుతాయని చెప్పారు. దీనిపై కలెక్టర్ కీర్తి స్పందిస్తూ, అదనపు హాస్టళ్ల ఏర్పాటుకు తక్షణమే అద్దె భవనం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజా కూడా పాల్గొన్నారు.
పోలీసు పీజీఆర్‌ఎస్‌కు
40 ఫిర్యాదులు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 40 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల నుంచి ఎస్పీ డి.నరసింహ కిషోర్ అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోనులో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్‌బీఎం మురళీకృష్ణ కూడా పాల్గొన్నారు.
ఆలయాలు, పిక్నిక్ స్పాట్లు, ఘాట్ల
వద్ద జాగ్రత్తలు పాటించాలి
రాజమహేంద్రవరం రూరల్: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో.. జిల్లాలోని ఆలయాలు, స్నానపు ఘాట్లు, పిక్నిక్ స్పాట్ల వద్ద ప్రజలు జాగ్రత్తలు, క్రమ శిక్షణ పాటించాలని ఎస్పీ డి.నరసింహ కిషోర్ సోమ వారం ఒక ప్రకటనలో సూచించారు. పోలీసు, దేవదాయ శాఖ, ఆలయ కమిటీల సూచనలు, జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. వన భోజనాలు, పిక్నిక్ స్పాట్ల వద్దకు వచ్చే ప్రజల సంఖ్యను బట్టి తగినన్ని భోజన కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అయ్యప్ప పడిపూజలు నిర్వహించే సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, దీపాలు వెలిగించినప్పుడు అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తడి ఇసుక, డ్రమ్ములతో నీటిని నిరంతరం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పోలీసు, ఫైర్, రెవెన్యూ, సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పోలీసుల సహాయం కోసం 112 నంబర్‌కు ఫోను చేయాలని ఎస్పీ సూచించారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా సత్యనారాయణ
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా సత్యనారాయణ

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
