పీజీఆర్‌ఎస్‌కు 200కు పైగా అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 200కు పైగా అర్జీలు

Nov 4 2025 7:26 AM | Updated on Nov 4 2025 7:26 AM

పీజీఆర్‌ఎస్‌కు 200కు పైగా అర్జీలు

పీజీఆర్‌ఎస్‌కు 200కు పైగా అర్జీలు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో ప్రజలు 200కు పైగా అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్‌ కీర్తి చేకూరి, జాయింట్‌ కలెక్టర్‌ మేఘాస్వరూప్‌ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో జవాబుదారీతనం అవసరమని అన్నారు. మోంథా తుపాను సందర్భంగా క్షేత్ర స్థాయిలో చురుకుగా చర్యలు తీసుకున్న అన్ని శాఖల సిబ్బందిని లభినందించారు. ఇటువంటి విపత్తుల సమయంలో మరింత వేగంగా స్పందించే విధానాన్ని బలోపేతం చేయాలని సూచించారు. తుపాను పంట నష్టాల వివరాలు త్వరితగతిన నమోదు చేసి, రైతులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ పంట నష్టాల అంచనాలు పూర్తయ్యాయని, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాల్లో త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

జల్‌జీవన్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

జల్‌ జీవన్‌ మిషన్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ కీర్తి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా నీటి, పారిశుధ్య మిషన్‌ సమీక్ష సమావేశంలో ఆమె పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జల్‌జీవన్‌ మిషన్‌ కింద జిల్లాకు రూ.2,315 కోట్లతో 1,168 పనులు మంజూరయ్యాయని తెలిపారు. వీటిలో రూ.1,938 కోట్ల అంచనాతో 731 పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వీటిలో 541 పూర్తయ్యాయని, 190 పురోగతిలో ఉన్నాయని చెప్పారు. పురోగతిలో ఉన్న అన్ని పనులనూ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) కింద జిల్లాలో 981 వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు మంజూరవగా, ఇప్పటివరకు నిర్మాణం పూర్తయినవి 515 ఉన్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement