కాశీలో కోనసీమ గరగనృత్య కళా ప్రదర్శన
కొత్తపేట: కోనసీమ గరగనృత్య కళాకారులు వారణాశి (కాశీ)లో గరగనృత్య ప్రదర్శనతో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేశారు. కాశీలో కాశీ విశ్వనాథ్ మందిర ప్రాంగణంలోని శ్రీత్య్రంబకేశ్వర్ హాలులో ఈ నెల 24 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు యజ్ఞోవైవిష్ణు పేరిట ఆదిత్య వైభవం, భారతీయ రుషి వైభవం, తెలుగు వైభవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వేద పండితుడు జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు వేయి మంది వేద పండితులు ప్రత్యేక పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా సోమవారం కోనసీమ కళాకారుల గరగనృత్యం ప్రదర్శన ఏర్పాటు చేశారు. కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన కళాకారుల టీమ్ లీడర్ కొమారిపాటి ఏసువెంకటప్రసాద్ ఆధ్వర్యంలో 15 మంది గరగనృత్యం ప్రదర్శించారు. కాశీ క్షేత్రంలో సోనాల్పుర నుంచి విశ్వేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం వరకు వేద పఠనంతో ఊరేగింపు నడుమ గరగనృత్య ప్రదర్శన నిర్వహించారు. రాత్రి జరిగిన అభినందన కార్యక్రమంలో టీమ్ లీడర్ ప్రసాద్‌ను నిర్వాహకులు సత్కరించారు. కళాకారులను అభినందించారు.


