యథావిధిగా జీతాలు ఆలస్యం! | - | Sakshi
Sakshi News home page

యథావిధిగా జీతాలు ఆలస్యం!

Oct 29 2025 7:47 AM | Updated on Oct 29 2025 7:49 AM

అన్నవరం దేవస్థానం శానిటరీ

ఉద్యోగులకు తప్పని వేతన వ్యథ

అక్టోబర్‌ 28 వచ్చినా 349 మందికి

అందని వైనం

అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న 349 మంది పారిశుధ్య సిబ్బందికి అక్టోబర్‌ 28వ తేదీ వచ్చినా ఇంకా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. వీరికి రూ.52 లక్షలు జీతాల రూపంలో చెల్లించాల్సి ఉంది. జీతాల చెల్లింపు ఆలస్యం కావడం ఇదే మొదటి సారి కాదు. ఈ ఏడాది నాలుగు సార్లు జీతాల చెల్లింపు ఆలస్యమైంది. అయితే సాక్షి దినపత్రికలో వార్తలు ప్రచురితమయ్యాక అధికారులు చర్యలు తీసుకొని జీతాలు చెల్లించారు. అయితే జీతాల చెల్లింపులో ఆలస్యానికి కారణం దేవస్థానానికి పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేస్తున్న గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీ కాంట్రాక్టర్‌ అని చెప్పేవారు.

పాత కాంట్రాక్ట్‌ చివరి నెలలో కూడా

తప్పని ఇబ్బంది

హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌టీఎస్‌ సంస్థ రెండేళ్లుగా దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహిస్తోంది. గత ఫిబ్రవరితో ఈ సంస్థ గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త టెండర్‌ ఖరారయ్యే వరకు మార్చి ఒకటో తేదీ నుంచి తాత్కాలికంగా శానిటరీ సిబ్బంది సరఫరాకు గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీకి కాంట్రాక్ట్‌ అప్పగించారు. ఏడు ప్రముఖ దేవస్థానాల శానిటరీ టెండర్‌ తిరుపతికి చెందిన పద్మావతి హాస్పటాలిటీ అండ్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సంస్థ దక్కించుకుంది. దాంతో అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి అన్నవరం దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహిస్తోంది. కనకదుర్గా శానిటరీ కాంట్రాక్టర్‌ కింద పనిచేసిన 349 మంది సిబ్బందికి సెప్టెంబర్‌ నెల జీతాలు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 28వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించలేదు.

జీతాల బిల్లు ఆడిట్‌కు పంపించాం

శానిటరీ సిబ్బంది సెప్టెంబర్‌ నెల జీతాల బిల్లు ఆడిట్‌కు పంపించాం. ఆడిటర్‌ సెలవులో ఉన్నా రు. ఆయన రెండు మూడు రోజు ల్లో వచ్చేస్తారు. ఆయన బిల్లు క్లియర్‌ చేసి పంపించిన వెంటనే జీతాలు చెల్లిస్తాం.

– వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం

ఈసారి ఆలస్యానికి కారణం

దేవస్థానం అధికారులే..

కనకదుర్గా ఏజెన్సీ ఈ నెల నాలుగో తేదీనే సిబ్బందికి చెల్లించాల్సిన పీఎఫ్‌ మొత్తాన్ని ముందుగా బ్యాంకులో జమ చేసి ఆ చలానాలు దేవస్థానానికి అందజేసింది. ఆ చలానాలు పరిశీలించి వెంటనే జీతాలు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలి. వారం రోజుల వ్యవధిలోనే జీతాల మొత్తాన్ని కాంట్రాక్టర్‌ అకౌంట్‌కు జమ చేయాలి. అలా జమ చేసిన గంటలోపు సిబ్బంది ఖాతాలకు జీతం జమ అవుతుంది. అయితే కనకదుర్గా ఏజెన్సీ కాంట్రాక్టర్‌ పీఎఫ్‌ చెల్లించి 24 రోజులు గడచినా సిబ్బందికి జీతాలు అందకపోవడం అధికారుల నిర్లక్ష్యంగానే పరిగణించాలి.

యథావిధిగా జీతాలు ఆలస్యం!1
1/1

యథావిధిగా జీతాలు ఆలస్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement