కన్నీరు రాకుండా.. | - | Sakshi
Sakshi News home page

కన్నీరు రాకుండా..

Oct 29 2025 7:49 AM | Updated on Oct 29 2025 7:49 AM

కన్నీ

కన్నీరు రాకుండా..

ముంపు పంటలను కాపాడుకుందాం

సస్యరక్షణ చర్యలు అవశ్యం

ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త

నందకిశోర్‌

ఐ.పోలవరం: వర్షం.. పుడమి పుత్రులకు కన్నీరు తెచ్చింది.. కష్టాన్ని నీట నాన్చింది.. బంగాళాఖాతంలో మోంథా తుపాను ప్రభావంతో పడుతున్న వర్షాలకు వందల ఎకరాల్లో వరి చేలు నేలకొరగడం, నీట మునగడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు పంటలను రక్షించుకునేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కన్వీనర్‌ డాక్టర్‌ ఎం.నంద కిశోర్‌ వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 1.63 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ప్రస్తుతం పంట పూత, పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశలలో ఉంది. ముఖ్యంగా ఎంటీయూ– 1318, స్వర్ణ, సంపద స్వర్ణ మొదలైన రకాలు పూత దశలో వర్షాలు కురిసినప్పుడు సంపర్కం జరగకపోవడం వల్ల తాలు గింజలు ఏర్పడతాయి. ఎంటీయూ– 1318 రకాలు గొలుసు కట్టు దగ్గరగా ఉండటం వల్ల గింజ రంగు మారడం, మాని పండు తెగులు వచ్చే అవకాశం ఉంది. నిరంతర వర్షాలతో గింజలో నిద్రావస్థ తొలిగి మొలక వచ్చే ప్రమాదం ఉంది. బ్యాక్టీరియా ఎండాకు తెగులు మరియు మాగుడు తెగులు వ్యాపించే ప్రమాదముంది. పాలు పోసుకునే దశలో ఉన్న రకాలు (స్వర్ణ, సంపద స్వర్ణ, మొదలైనవి) వర్షాల వల్ల పడిపోతే పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. చిన్న కాలువలను ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటోంది. ఎక్కువగా నీరు నిలిచిన చోట పెద్ద కాలువలు చేసి మోటార్ల ద్వారా తొలగించాలి.

కోత సమయం ఉంటే..

ఫ గింజ తోడుకొని లేదా గట్టి పడే దశలో లేదా కోత దశలో అకాల వర్షాలతో మొక్క పడిపోయి నేలకొరిగే అవకాశం ఉంది. దీనితోపాటు పడిపోయిన చేనుల నుంచి వచ్చే ధాన్యం మిల్లింగ్‌ సమయంలో విరిగిపోయి నూక ఎక్కువ రావచ్చు. కోసిన పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లయితే నీరు పూర్తిగా బయటకు పోవటానికి కాలవలు ఏర్పాటు చేసుకోవాలి.

ఫ గింజ మొలకెత్తకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేవిధంగా పిచికారీ చేయాలి. నిద్రావస్థ లేనటువంటి సాంబ మసూరి వంటి రకాలు మరియు నిద్రావస్థ ఉన్న రకాలలో వారం రోజుల పాటు చేను పడిపోయి నీట మునిగినప్పుడు మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించడానికి చేనుకు సమతుల్యంగా ఎరువులు వేయాలి.

ఫ వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సిఫారసు మేరకు పొటాష్‌ వేయడం, వెదజల్లిన పద్ధతిలో ఎక్కువ విత్తనం వేయకుండా ఉండటం, అవసరానికి మించి నీరు పెట్టకుండా ఉంటే చేసు పడటాన్ని తగ్గించవచ్చు. వారం రోజుల కన్నా ఎక్కువగా నీట మునిగినట్లయితే గింజలలో నిద్రావస్థ తొలిగి చేనుపైనే మొలక వచ్చే అవకాశం ఉంది.

ఇలా చేద్దాం..

ఫ గింజలు రంగు మారడం, మాగుడు, మానిపండు తెగుళ్ల వ్యాప్తి నివారణకు ఎకరాకు 200 మిల్లీలీటర్ల ప్రోపికోనాజోల్‌ మందును పిచికారీ చేయాలి.

ఫ గింజ గట్టిపడే దశలో ఉన్న పంట అధిక వర్షాలకు ముంపు బారిన ఉంటే అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి.

ఫ నిలిచిన లేదా పడిపోయిన పంటలో కంకిలో మొలకలు కనపడితే 5 శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాములు స్ఫటిక ఉప్పు / లీటరు నీటికి) కలిపి పిచికారీ చేయాలి. ఇది మొలకలు రంగు మార్పును తగ్గిస్తుంది.

తెగుళ్ల నియంత్రణ ఇలా..

ప్రస్తుతం బ్యాక్టీరియా ఎండాకు తెగులు, మాగుడు తెగులు వ్యాపించే అవకాశం ఉంది. బ్యాక్టీరియా ఎండాకు తెగులు కనిపిస్తే ప్లాంటోమైసిస్‌ ఒక మిల్లీలీటరును లీటరు నీటిలో కలపాలి, అలాగే కొసైడ్‌ (కాపర్‌ ఆక్సి క్లోరైడ్‌) 2 గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి ఈ రెండింటి మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయాలి. నీరు తగ్గిన తరువాత హెక్సాకోనాజోల్‌ 400 మి.లీ/ఎకరాకు లేదా ప్రోపికోనాజోల్‌ 200 మి.లీ/ఎకరాకు పిచికారీ చేయడం ద్వారా మాగుడు తెగులు వ్యాప్తి తగ్గుతోంది.

కన్నీరు రాకుండా..1
1/1

కన్నీరు రాకుండా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement