స్వీట్ స్టాల్ పొయ్యిపై పడిన కొబ్బరి చెట్టు
● చెలరేగిన మంటలు
● తప్పిన ప్రమాదం
పి.గన్నవరం: మండలంలోని నరేంద్రపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం స్వీట్స్ తయారీ షెడ్డుపై ఈదురు గాలులకు కొబ్బరిచెట్టు విరిగిపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న నలుగురు త్రుటిలో తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేంద్రపురం గ్రామంలో పప్పుల వెంకటేష్ స్వీట్ స్టాల్ నడుపుతున్నాడు. అతని షాపు వెనుక భాగంలోని షెడ్డులో స్వీట్, హాట్ తయారు చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం స్వీట్స్ తయారు చేస్తుండగా ఈదురు గాలులకు పక్కనే ఉన్న కొబ్బరిచెట్టు పెళ, పెళమని శబ్దం చేస్తూ విరిగి తయారీ కేంద్రంపై పడిపోయింది. దీంతో మంటలు వ్యాపించాయి. ఈ శబ్దాలను గమనించిన నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. రెండు కళాయిల్లో మరుగుతూ ఉన్న నూనె కూడా చెల్లాచెదురుగా పడిపోయింది. స్థానికులు మంటలు అదుపు చేశారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వీట్ స్టాల్ యజమానికి నష్టం వాటిల్లింది.


