
విజయమివ్వు విఘ్నేశ్వరా..
అయినవిల్లి: ప్రసిద్ధి చెందిన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామివారిని వివిధ పుష్పాలతో అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయం తలుపులు మూసివేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 100 మంది పాల్గొన్నారు. ముగ్గురికి తులాభారం నిర్వహించారు. శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 23 జంటలు పాల్గొనగా, స్వామికి ఒక భక్తుడు తలనీలాలు సమర్పించారు. 27 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 1,480 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు ఆలయానికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాలుగా రూ.2,05,396 ఆదాయం సమకూరిందని అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.