
క్వారీ.. సారీ
ఫ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం
ఫ కుదేలైన పరిశ్రమ
ఫ గౌరీపట్నం ప్రాంతంలో 60 క్రషర్లు,
40 క్వారీలు
ఫ క్రషర్లను స్క్రాప్‌కు అమ్మేస్తున్న యజమానులు
ఫ ఉపాధి లేక వలస పోతున్న కార్మికులు
ఫ సంక్షోభంలో క్వారీలు
దేవరపల్లి: ఒకప్పుడు యజమానులకు కాసులు కురిపించిన నల్లరాతి క్వారీ పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేవరపల్లి మండలం గౌరీపట్నం, కొండగూడెం, దుద్దుకూరు, బందపురం, లక్ష్మీపురంతో పాటు కొవ్వూరు మండలం ఐ.పంగిడి, దేచర్ల ప్రాంతాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా నల్లరాతి క్వారీలు విస్తరించి ఉన్నాయి. వీటికి అనుబంధంగా పలువురు స్టోన్ క్రషర్లను స్థాపించి ఇక్కడి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు నల్లరాతి మెటల్‌ను సరఫరా చేస్తున్నారు. క్వారీల్లోని నల్లరాతి ముక్కలను (పాల్స్) లారీల ద్వారా క్రషర్ వద్దకు తరలిస్తారు. అక్కడ వివిధ సైజుల్లో క్రషింగ్ చేసి భవన నిర్మాణాలు, సీసీ, తారు రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణానికి సరఫరా చేస్తూంటారు.
కరెంట్ బిల్లులు సైతం కట్టలేక..
దాదాపు మూడు దశాబ్దాలుగా ఇక్కడ క్వారీ త్వకాలు జరుగుతున్నాయి. ఇన్నేళ్లూ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన క్వారీ పరిశ్రమ దాదాపు రెండేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీనికి కూటమి సర్కారు అనుసరిస్తున్న వైఖరే కారణంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూటమి సర్కారు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో, కొత్త పనులు చేయడానికి వారు ముందుకు రావడం లేదు. ఫలితంగా ప్రధాన రహదారులు, ప్రభుత్వ కాలనీల నిర్మాణం వంటి పనులు నిలిచిపోయాయి, ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు ప్రభుత్వ వైఖరితో తమ వ్యాపారం కుదేలైందని క్వారీ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం పాత బిల్లులు చెల్లించి, కొత్త పనులు ప్రారంభిస్తేనే మెటల్ వ్యాపారం జరుగుతుందని చెబుతున్నారు. కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో కూరుకుపోయామని ఆవేదన చెందుతున్నారు. ఒక్కో క్రషర్‌కు సామర్థ్యాన్ని బట్టి నెలకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకూ కరెంటు బిల్లు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో క్రషర్ తిప్పితే కరెంటు బిల్లుకు కూడా రాబడి ఉండటం లేదని వాపోతున్నారు. జిల్లా, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలకు ప్రతి ఆరు నెలలకోసారి మైనింగ్ సెస్ జమ చేసేవారు. క్వారీలు సంక్షోభంలో కూరుకుపోవడంతో ఈ రూపేణా స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయం తగ్గిందని ప్రజాప్రతినిధులు అంటున్నారు.
మూత పడుతున్న క్రషర్లు
వ్యాపారాలు లేకపోవడంతో స్టోన్ క్రషర్లు మూత పడుతున్నాయి. కొంత మంది యజమానులు క్రషర్లను తిప్పలేక స్క్రాప్‌కు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. స్క్రాప్‌కు అమ్మితే క్రషర్‌కు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు వస్తోందని, కొత్త క్రషర్ నిర్మించాలంటే సుమారు రూ.3 కోట్లు అవుతుందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడి క్వారీ పరిశ్రమలో సుమారు 30 క్రషర్లు మూత పడి, స్క్రాప్‌కు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో పదేళ్ల క్రితం సుమారు 150 క్రషర్లు, 120 క్వారీలు ఉండేవి. ప్రస్తుతం 40 క్వారీలు, 60 క్రషర్లు ఉండగా, వీటిల్లో పని చేస్తున్న కార్మికుల సంఖ్య 20 వేల నుంచి 5 వేలకు పడిపోయింది. ఇక్కడ ఉపాధి లేక అనేక మంది కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.
అప్పుల్లో కూరుకుపోయారు
కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు ప్రారంభంకాలేదు. దీని ప్రభావం పరిశ్రమపై పడి, క్వారీలు, క్రషర్ల యజమానులు అప్పుల్లో కూరుకుపోయారు. మూడు నెలల్లో 20 క్రషర్లు మూతబడ్డాయి. కార్మికులకు జీతాలు, కరెంట్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి. యూనిట్ మెటల్ రేటు రూ.1,800 ఉంది. డీజిల్, కరెంట్ చార్జిలు, కార్మికుల వేతనాలు పెరిగాయి. కానీ, మెటల్ ధర పెరగకపోవడంతో గిట్టుబాటు కావడం లేదు. పుష్కరాల పనులపై ఆశలు పెట్టుకున్నాం.
– ముదునూరి సూర్యనారారాయణరాజు,
ఉపాధ్యక్షుడు, జిల్లా క్వారీ, క్రషర్స్ ఓనర్స్
అసోసియేషన్, గౌరీపట్నం
వ్యాపారం పడిపోయింది
క్వారీ పరిశ్రమ సంక్షోభంలో ఉంది. మెటల్ వ్యాపారం పడిపోయింది. క్రషర్లు తిప్పడారని యజమానులు భయపడుతున్నారు. ఇప్పటికే చాలా క్రషర్లు మూతబడ్డాయి. ఇటీవల 20 క్రషర్లను స్క్రాప్‌కు అమ్ముకున్నారు. స్టోన్ క్రషర్లను ఎంఎస్‌ఎంయూలో చేర్చి రాయితీలివ్వాలి. రహదారుల నిర్మాణం చేపడితే పరిశ్రమ కోలుకుంటుంది. పరిశ్రమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతా.
– ఆండ్రు అనిల్, అధ్యక్షుడు, జిల్లా క్వారీ,
క్రషర్స్ ఓనర్స్ అసోసియేషన్,
గౌరీపట్నం
ఉపాధి కోల్పోయిన కార్మికులు
మెటల్ ధర పతనం కావడంతో క్వారీలు, క్రషర్లు మూతబడుతున్నాయి. పరిశ్రమ సంక్షోభంలో ఉండటంతో కార్మికులు ఉపాధి కోల్పోయి, ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. ప్రభుత్వం ఈ పరిశ్రమను ప్రోత్సహిస్తే కార్మికులకు ఉపాధి దొరుకుతుంది.
– షేక్ మస్తాన్,
అధ్యక్షుడు, రాష్ట్ర ప్రగతిశీల కార్మిక సమాఖ్య
20 వేల మందికి ఉపాధి
ఇక్కడ లభించే నల్లరాతి మెటల్ ఎంతో నాణ్యతగా ఉంటుంది. అందుకే దీనిని నల్ల బంగారంగా పిలిచేవారు. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని క్వారీ పారిశ్రామిక వాడగా గుర్తించింది. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, భీమవరం, విజయవాడ ప్రాంతాలకు చెందిన యజమానులు ఈ ప్రాంతంలో క్వారీలు ఏర్పాటు చేసి, స్టోన్ క్రషర్లు స్థాపించి, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. విశాఖపట్నంతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 20 వేల మంది కార్మికులు ఈ పరిశ్రమలోని వివిధ రంగాల్లో ఉపాధి పొందేవారు.
పుష్కరాల పనులపై ఆశలు
ప్రస్తుతం క్వారీ, క్రషర్ యజమానులు 2027లో గోదావరి పుష్కరాలపై ఆశలు పెట్టుకున్నారు. ఆ సందర్భంగా కొత్త పనులతో పాటు రోడ్ల అభివృద్ధి, భవన నిర్మాణాల వంటి పనులు ప్రారంభమై, వ్యాపారం పుంజుకుంటుందని భావిస్తున్నారు. పుష్కరాల పనులకు ఈ ప్రాంతంలోని మెటల్‌ను వినియోగించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రభుత్వానికి రూ.120 కోట్ల ఆదాయం
ఇక్కడి క్వారీల ద్వారా మైనింగ్ సెస్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.120 కోట్ల ఆదాయం వస్తోంది. గతంలో ఏటా రూ.150 కోట్లు వచ్చేది. ఈ మొత్తంతో స్థానిక సంస్థలు బలోపేతం కావడంతో పాటు, గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించేవారు.

క్వారీ.. సారీ

క్వారీ.. సారీ

క్వారీ.. సారీ

క్వారీ.. సారీ

క్వారీ.. సారీ