
కలంపై కక్షా?
● జిల్లావ్యాప్తంగా జర్నలిస్టుల నిరసనలు
● సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై
కేసులు ఎత్తివేయాలని డిమాండ్
● పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు
● అధికారులకు వినతులు
● ఏపీయూడబ్ల్యూజే, ప్రజా సంఘాలు,
ప్రెస్ క్లబ్ మద్దతు
సాక్షి, రాజమహేంద్రవరం: కలంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు గళమెత్తాయి. సర్కారు మీడియా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిరసనకు దిగాయి. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన ‘సాక్షి’ మీడియాపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా జర్నలిస్టు, ప్రజా సంఘాల నేతలు, ప్రతినిధులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ప్రజల స్వరాన్ని వినిపిస్తున్న పాత్రికేయ కలంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంపై గళమెత్తారు. ప్లకార్డులు చేబూని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలాంటి దారుణమైన సంస్కృతికి వెంటనే స్వస్తి చెప్పాలని హితవు పలికారు. భావ ప్రకటన స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. నకిలీ మద్యంపై వార్తలు రాస్తే ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితో పాటు, పాత్రికేయులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.
వార్తలు రాస్తే కేసులు పెట్టడం దారుణమని, ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వార్తా సంస్థలనూ ఒకేలా చూడాలని హితవు పలికారు. ‘‘నకిలీ మద్యం తాగితే మనుషులు చనిపోరా.. దీనిపై వార్తలు రాస్తే రిపోర్టర్లు, ఎడిటర్లను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చారని రాయడం తప్పా? నకిలీ మద్యం తప్పని రాయడం కూడా మీకు తప్పేనా? నకిలీ మద్యం మంచిదేనని ప్రభుత్వం చెబుతోందా? ఇప్పటికై నా ప్రభుత్వం ‘సాక్షి’పై కక్ష సాధింపు మానుకోవాలి. తప్పుడు కేసులు ఎత్తివేయాలి.
జర్నలిస్టులు, మీడియా సంస్థలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం మానుకోవాలి. లేని పక్షంలో జర్నలిస్టు సంఘాలన్నీ ఏకమై పోరాడతాయి’’ అని హెచ్చరించారు.
● ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు రిపోర్టర్లపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధించడాన్ని మండల కేంద్రమైన పెదపూడిలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ తహసీల్దార్ పీవీ సీతాపతిరావుకు వినతిపత్రం సమర్పించారు.
● జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యాన నిడదవోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. తహసీల్దార్ నాగరాజు నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.
● గోపాలపురంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
● నియోజకవర్గ కేంద్రమైన కొవ్వూరులో జర్నలిస్టులు కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు. అనంతరం ఆర్‌డీఓ రాణి సుస్మితకు వినతిపత్రం అందజేశారు. ‘సాక్షి’పై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు జర్నలిస్టులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో...
ఏపీయూడబ్ల్యూజే, రాజమండ్రి ప్రెస్‌క్లబ్, ప్రజా సంఘాల నేతలు, జర్నలిస్టులు రాజమహేంద్రవరంలో ఆందోళన చేపట్టారు. ఎస్పీ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. నిజాలు నిర్భయంగా రాస్తున్న ‘సాక్షి’ పత్రికపై ప్రభుత్వం, పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు రోజులుగా సాక్షి ప్రధాన కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేస్తూ, పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. అడిషనల్ ఎస్పీ ఎంబీఎన్ ముళీకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ కార్యదర్శి మండెల శ్రీరామ్మూర్తి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి మాట్లాడుతూ, ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలకు సంబంధించి ఎడిటర్ ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్‌చార్జిలకు పోలీసులు నోటీసులు జారీ చేయడం, పత్రికా కార్యాలయంలో హడావుడి చేయడం, ఒక వార్త రాసినందుకు విచారణ పేరుతో 170 ప్రశ్నలు సంధించడం ప్రత్యక్ష వేధింపుల కిందకే వస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తున్న ‘సాక్షి’పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసినంత మాత్రాన ఎడిటర్, సంబంధిత ఉద్యోగులపై కక్షపూరిత చర్యలు తీసుకోరాదంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా, వాటిని తుంగలో తొక్కుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎన్‌టీవీ స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్, సాక్షి టీవీ స్టాఫ్ రిపోర్టర్ హరీష్, సాక్షి పత్రిక స్టాఫ్ రిపోర్టర్ ఫయాజ్ బాషా, జర్నలిస్టులు విశ్వనాథ్, సత్యంబాబు, పీఎస్ గంగాధర్, సత్యనారాయణ, దానవాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కేసులు భావ్యం కాదు
వార్తలు రాసే మీడియా సంస్థలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం భావ్యం కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారన్న కారణంతో ‘సాక్షి’ ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు బనాయించి వేధించడం తగదు. వార్తల్లో తప్పు ఉంటే రిజాయిండర్ ఇవ్వాలే తప్ప ఇలాంటి చర్యలు తగవు. ప్రభుత్వం పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి.
– మండెల శ్రీరామ్మూర్తి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ కార్యదర్శి
పత్రికా స్వేచ్ఛను హరించడమే
పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రభుత్వానికి తగదు. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా పత్రికలను నియంత్రించడం మంచి పరిణామం కాదు. వార్తలు రాసే విషయంలో పత్రికలకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదు. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి.
– కుడుపూడి పార్థసారథి,
రాజమండ్రి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే..
‘సాక్షి’పై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. సమస్యలపై ప్రజలను చైతన్యపరుస్తున్న మీడియాపై ప్రభుత్వాలు కక్ష కట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. సాక్షి పత్రిక, ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. కేసులు ఉపసంహరించుకునేంత వరకూ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు.
– గెడ్డం రవీంద్రబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, కుల నిర్మూలన పోరాట సమితి, సమిశ్రగూడెం, నిడదవోలు మండలం
‘సాక్షి’పై దాడులు ఆపాలి
‘సాక్షి’ మీడియాపై పోలీసు దాడులను తక్షణం ఆపాలి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియాకు సంకెళ్లు వేయడం మంచిది కాదు. ‘సాక్షి’ కార్యాలయాల్లో సోదాలు చేయడం, ఎడిటర్, బ్యూరో ఇన్‌చార్జిలకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం రాజ్యాగం విరుద్ధం.
– షేక్ మస్తాన్,
ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు

కలంపై కక్షా?

కలంపై కక్షా?

కలంపై కక్షా?

కలంపై కక్షా?

కలంపై కక్షా?