పట్టుబట్టి.. తూర్పార బట్టి.. | - | Sakshi
Sakshi News home page

పట్టుబట్టి.. తూర్పార బట్టి..

Oct 8 2025 6:21 AM | Updated on Oct 8 2025 6:21 AM

పట్టు

పట్టుబట్టి.. తూర్పార బట్టి..

సాక్షి ప్రతినిధి, కాకినాడ/బోట్‌క్లబ్‌: కూటమి సర్కార్‌ తీరుపై తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. జిల్లా పరిషత్‌లో పూర్తి ఆధిపత్యం కలిగిన వైఎస్సార్‌ సీపీ సభలో పైచేయి సాధించింది. సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు వైఎస్సార్‌ సీపీ సభ్యులు కూటమి సభ్యులకు చుక్కలు చూపించారు. సర్కార్‌ పాలనా తీరును వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తీవ్ర స్థాయిలో ఎండగట్టడంతో సమావేశం ఆద్యంతం కూటమి పక్ష సభ్యులు ఖిన్నులయ్యారు. మంగళవారం కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. తొలుత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కరప ఎంపీడీఓ బి కృష్ణగోపాల్‌కు సంతాపంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం అజెండాపై చర్చ ప్రారంభమవ్వగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వచ్చిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చకు వైఎస్సార్‌ సీపీ సభ్యులు పట్టుబట్టారు. జిల్లాలో రైతులను ఇబ్బందులు పాల్జేస్తోన్న యూరియా కొరత, మెట్ట ప్రాంత మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలతో రైతులకు జరిగిన నష్టం, జీఎస్‌టీ, రంపచోడవరం ఏజెన్సీలో ప్రొటోకాల్‌ పాటించని తీరు, జిల్లాలో అధ్వానంగా తయారైన రహదారులు తదితర అంశాలపై చర్చ వాడివేడిగా జరిగింది. తొలుత గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను కూటమి సర్కార్‌ ప్రైవేటీకరించడంపై సభ అట్టుడికింది. ఈ అంశంపై చర్చ జరగాల్సిందే, ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా సభ తీర్మానాన్ని ఆమోదించాల్సిందేనని వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ సభ్యులు గన్నవరపు శ్రీనివాస్‌, కుడుపూడి శ్రీనివాసరావు, గుబ్బల తులసీకుమార్‌, ఉలవకాయల లోవరాజు తదితరులు పట్టుబట్టారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్‌ వ్యతిరేకించడంతో ఇరుపక్షాల మధ్య సంవాదం చోటు చేసుకుంది. సమావేశంలో ప్రైవేటీకరణపై చర్చ కోసం పట్టుబట్టి చివరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌ సీపీ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ వేణుగోపాలరావు కల్పించుకుని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు సూచించడంతో సభ్యులకు సర్దిచెప్పి తిరిగి సభలోకి తీసుకురావడంతో సమస్య సద్దుమణిగింది.

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం

అనంతరం జరిగిన మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై జరిగిన చర్చలో వైఎస్సార్‌ సీపీ సభ్యులు పాల్గొని కూటమి సర్కార్‌ తీరును ఎండగట్టారు. నిర్మాణాలు పూర్తి అయిన మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించి ప్రభుత్వ వైద్యవిద్యను పేదలకు దూరం చేసే కూటమి కుట్రలను రాజ్యసభ సభ్యుడు సుభాష్‌చంద్రబోస్‌, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తీవ్ర స్థాయిలో నిరసించారు. 16 సంవత్సరాలు సీఎంగా ఒక్క కాలేజీ కూడా తీసుకురాలేకపోయిన చంద్రబాబు.. 17 కాలేజీలను జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువస్తే వాటిని ప్రైవేటీకరిస్తున్నారని సభ్యులు ధ్వజమెత్తారు. చర్చ అనంతరం ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్వసభ్య సమావేశం తీర్మానాన్ని ఆమోదింపచేయడంలో వైఎస్సార్‌ సీపీ సభ్యులు సభలో పై చేయి సాధించారు. జిల్లాలో యూరియా కొరతతో రైతులు పడుతున్న కష్టాలు సర్కార్‌ చెవికెక్కలేదంటూ గొల్లప్రోలు, తాళ్లరేవు జెడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల లోవరాజు, దొమ్మేటి సాగర్‌ ప్రశ్నించారు. 2023తో పోలిస్తే 2025లో 3వేల మెట్రిక్‌ టన్నులు యూరియా అధికంగా పంపిణీ చేశామని వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్‌ ఇచ్చిన వివరణపై ఎంపీ బోస్‌ తప్పుపట్టారు. చెబుతున్న లెక్కలకు జిల్లాల్లో ఎరువుల పంపిణీకి అసలు పొంతనే ఉండటం లేదన్నారు. ఇంతలో ఎమ్మెల్సీ అనంతబాబు కల్పించుకుని రంపచోడవరం ఏజెన్సీలో వర్షాభావ పరిస్థితుల్లో ఐదు ఎకరాల రైతుకు ఒక యూరియా బస్తా కూడా ఇవ్వలేదన్నారు. మెట్ట ప్రాంతంతో పోలిస్తే ఏజెన్సీలో రైతులు యూరియా కోసం నానా పాట్లు పడ్డారన్నారు. జగన్‌ ప్రభుత్వంలో నూరుశాతం రాయితీ విత్తనాలు అందిస్తే ఇప్పుడు ఎంతమంది రైతులకు ఎన్ని టన్నులు ఇచ్చారో చెప్పాలని అనంతబాబు ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లభించలేదు. ఏజెన్సీలో ప్రొటోకాల్‌ పాటించకపోవడాన్ని వై రామవరం ఎంపీపీ ఆనంద్‌, జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి నిలదీశారు. వై రామవరం మండలం చింతలపూడి పంచాయతీలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఫ్లెక్సీ పెట్టి కుటుంబ సభ్యులు టెంకాయ కొట్టిన ఫ్లెక్సీ ఫొటోను అనంతబాబు సభలో ప్రదర్శించి అధికారుల తీరును ప్రశ్నించారు. ప్రొటోకాల్‌ పాటించకుండా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను అవమానపరుస్తున్నారని ఎమ్మెల్సీ అనంతబాబు, రంపచోడవరం ఎంపీపీ వెంకటలక్ష్మి ప్రశ్నించారు. ఐటీడీఏలో డీఈఈ చైతన్య చేసిన పనులకు రెండోసారి బిల్లులు పెట్టి రూ.40 లక్షలు కాజేసిన విషయాన్ని నిరూపిస్తానని ఎమ్మెల్సీ అనంతబాబు నిలదీయగా సమాధానం ఇవ్వలేక అధికారులు నీళ్లు నమిలారు.

నకిలీ పత్తి విత్తనాల ప్రస్తావన

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు, చేబ్రోలు తదితర ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు లోవరాజు సభ దృష్టికి తీసుకువచ్చారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయగా విచారణ చేస్తున్నామని, నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్‌ షణ్మోహన్‌ వివరణ ఇచ్చారు. ఉప్పాడ బీచ్‌ రోడ్డు చాలా అధ్వానంగా తయారైనా పట్టించుకోవడం లేదని జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ మేరుగు పద్మలత ప్రశ్నించారు. తుని ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి తల్లి తనువు చాలించిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడాన్ని ఆమె నిలదీయగా విచారణ చేస్తున్నామని చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు. మరో ఏడాది మాత్రమే తమ పదవీ కాలం ఉందని, ఇప్పటికై నా నిధులు విడుదల చేయాలని జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్‌ చేశారు. జీఎస్‌టీకి అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదించే విషయంపై కూటమి పక్ష ప్రజాప్రతినిధులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సోము వీర్రాజుతో వైఎస్సార్‌ సీపీ రావులపాలెం, గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యులు కుడుపూడి శ్రీనివాసరావు, లోవరాజు విభేదించారు.

సమావేశానికి హాజరైన వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ విప్పర్తి. చిత్రంలో కలెక్టర్‌ షణ్మోహన్‌,, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు

సాగునీటి కొరత రాకుండా చర్యలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.79 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు నీటి కొరత రాకుండా చూడాలని సభ్యులు అధికారులకు సూచించారు. ఇప్పటి వరకూ 60 టీఎంసీలు సరఫరా చేశామని, గోదావరిలో చేరిన సర్‌ ప్లస్‌ సరఫరా చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. సీలేరు జలాలను కూడా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. ఆలమూరు మండలం లంక భూముల్లో మట్టిని ఇటుక బట్టీల కోసం లోతుగా తవ్వేయడంతో దొండ, ఇతర కూరగాయల పంటల సాగు కనుమరుగవుతోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గోకవరం, కోరుకొండ, రాజానగరం మండలాలు ఎక్కడో దూరంగా ఉన్న అమలాపురం ఇరిగేషన్‌ డివిజన్‌ పరిధిలో ఉండటం వల్ల అధికారుల పర్యవేక్షణకు, రైతుల సమస్యల పరిష్కారానికి అసౌకర్యంగా ఉందని, వాటిని రాజమహేంద్రవరం డివిజన్‌ పరిధిలోకి తేవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన ప్రతిపాదనను సభ ఆమోదించింది. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరన్‌రాజ్‌, తూర్పుగోదావరి డీఆర్వో టీ.సీతారామమూర్తి, కోనసీమ జిల్లా డీఆర్వో కె.మాధవి పాల్గొన్నారు.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను

వ్యతిరేకిస్తూ తీర్మానం

యూరియా కొరతపై

గళం విప్పిన సభ్యులు

నకిలీ పత్తి విత్తనాలపై నిలదీత

రంపచోడవరం మన్యంలో

ప్రొటోకాల్‌పై చర్చ

గరం..గరంగా ‘తూర్పు’ జెడ్పీ సమావేశం

పట్టుబట్టి.. తూర్పార బట్టి..1
1/3

పట్టుబట్టి.. తూర్పార బట్టి..

పట్టుబట్టి.. తూర్పార బట్టి..2
2/3

పట్టుబట్టి.. తూర్పార బట్టి..

పట్టుబట్టి.. తూర్పార బట్టి..3
3/3

పట్టుబట్టి.. తూర్పార బట్టి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement