పెరవలి: ఆలయానికి వచ్చే అపవిత్ర భక్తులు, మంత్రోచ్ఛారణలో తప్పులు, ఆలయంలోకి వచ్చే క్రిమికీటకాల వలన జరిగే అపవిత్రతను పోగొట్టేందుకే ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. పెరవలి మండలం అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి.
వేద పండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఈ పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్లకు హోమగుండం ఏర్పాటు చేసి అనంతరం వేదపండితులు పవిత్రాలకు పూజలు చేశారు. అనంతరం పవిత్రాలను, కలశాలను నెత్తిన పెట్టుకుని స్వామి వారికి సమర్పించారు. ఈ పవిత్రాల వల్ల ఆలయానికి, స్వామి వారికి భక్తులు, పండితుల వలన జరిగిన అపవిత్రత పోయి మళీకల జీవం వస్తుందని వర ప్రసాదాచార్యులు తెలిపారు.
పంచారామ యాత్ర, శబరిమలైకి ప్రత్యేక బస్సులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే కార్తికమాసం సందర్భంగా పంచారామ క్షేత్ర దర్శనం, అయ్యప్పస్వామి యాత్ర చేసే వారికి శబరిమలై ప్రత్యేక బస్సులు కాకినాడ డిపో నుంచి ఏర్పాటు చేస్తామని జిల్లా ప్రజారవాణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోలో మంగళవారం యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. పంచారామ స్పెషల్ అక్టోబర్ 25, 26 తేదీల్లో, నవంబర్ 1, 2, 8, 9, 15, 16 తేదీల్లోను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కాకినాడలో శనివారం రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట దర్శనం తర్వాత కాకినాడ చేరుకొంటుందన్నారు. శబరిమలై యాత్రవెళ్లే అయ్యప్పభక్తులు వారు కోరుకున్న చోట నుంచి కోరుకొన్న క్షేత్రాలను చూపించడానికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ యాత్రకు వెళ్లే వారు 99592 25564 నంబర్‌లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మనోహర్, పీఆర్వో వెంకటరాజు పాల్గొన్నారు.
కార్తిక మాస ఏర్పాట్లపై నేడు సమావేశం
అన్నవరం: ఈ నెల 22 నుంచి నవంబర్ 20 వ తేదీ వరకు కొనసాగనున్న కార్తికమాసంలో అన్నవరం శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి విచ్చేసే భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై బుధవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి ప్రకాష్‌సదన్ సత్రంలోని ట్రస్ట్‌బోర్డు హాలులో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది.
ఘనంగా ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి ఆశ్వీయుజ పౌర్ణిమ పర్వదినం సందర్భంగా మంగళవారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. హోమం అనంతరం ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు వేద పండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.
అనంతరం అమ్మవారికి ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. ప్రత్యంగిర హోమంలో 30 మంది భక్తులు రూ.750 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి పాల్గొన్నారు. రూ.22,500 ఆదాయం దేవస్థానానికి సమకూరింది. వేద పండితులు యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, ఆలయ పరిచారకులు చిట్టెం వాసు, వేణు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్ ప్రత్యంగిర హోమం నిర్వహించారు.

ముగిసిన పవిత్రోత్సవాలు