
ప్రతీ కేసులో సాంకేతిక ఆధారాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రతి కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి, అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి దర్యాప్తు చేయాలని, తద్వారా శిక్షాకాలం పెంచవచ్చని ఎస్పీ డి.నరసింహాకిశోర్ తెలిపారు. నెలవారీ నేర సమీక్షా సమావేశం సోమవారం పోలీసు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్ల కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. గ్రేవ్ కేసులలో నిర్ణీత గడువు లోపల విచారణ పూర్తి చేసి, చార్జీషీట్ దాఖలు చేయాలన్నారు. దీపావళి పండగ వస్తున్న నేపథ్యంలో బాణసంచా పేలుళ్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అంతట దీపావళి మందు గుండు సామగ్రి స్టోరేజ్ గోడౌన్లు, అమ్మకాలు జరిగే ప్రదేశాలను ఆకస్మిక తనిఖీలు చేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం భద్రతా చర్యలు తీసుకుంటున్నారా, లేదా పరిశీలించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన బ్లాక్ స్పాట్లలో డ్రోన్ సర్వైలెనన్స్ విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనుమానిత ప్రాంతాలలో కార్డన్ ఆపరేషన్ నిర్వహించాలని, సంబంధిత పోలీసు అధికారులు అందరూ విలేజ్ విజిట్స్ తప్పక చేయాలన్నారు. తద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురయ్యే వివిధ సమస్యలను అరికట్టవచ్చన్నారు. రాత్రి పూట అన్ని స్టేషన్లలలో గస్తీలు ముమ్మరం చెయ్యాలని, అనుమానితుల వేలిముద్రలు ఎంఎస్‌డీ డివైస్ ద్వారా చెక్ చేయాలన్నారు. అనంతరం గత నెల రోజులలో వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. దీపావళి సందర్భంగా బాణసంచా తయారీదారులు, అమ్మకందారులు, వినియోగదారులు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై, పోస్టర్లను విడుదల చేశారు. అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ,సుబ్బరాజు, జోనల్ డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
క్రైం రివ్వూలో ఎస్పీ నరసింహకిశోర్