
సీజేఐపై దాడి దుర్మార్గం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయిపై దాడి దుర్మార్గమని ఎస్‌ఎఫ్‌ఐ పేర్కొంది. న్యాయమూర్తిపై దాడికి నిరసనగా మంగళవారం ఆర్ట్స్ కళాశాల అర్బన్ స్క్వేర్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.భాస్కర్, ఎన్.రాజా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై మతోన్మాదుల దాడి అన్యాయమన్నారు. సనాతన ధర్మానికి అవమానం జరిగిందన్న పేరుతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై మతోన్మాద అడ్వకేట్ ఒకరు కోర్టులో అందరూ చూస్తుండగానే చెప్పు విసరడం దేశంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోందన్నారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మతోన్మాదులు ఆగడాలు పెరిగిపోతున్నాయని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే దాడికి తెగబడేంత ధైర్యం చేశారన్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ప్రజాస్వామ్యానికి రక్షణ ఏముంటుందన్నారు. ఇలాంటి దాడులను ఖండించాలన్నారు. సనాతన ధర్మం పేరుతో ఎవరిపైబడితే వారిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు లహరి, జ్యోతి, సౌమ్య, భాగ్యలక్ష్మి, అమృత, సంధ్య, బాలాజీ, కనక, కార్తిక్, హేమంత్, మౌళి, సాయి పాల్గొన్నారు.