
వాల్మీకి జీవితం ఆదర్శనీయం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రామాయణాన్ని మహాకావ్యంగా లోకానికి పరిచయం చేసిన వాల్మీకి మహర్షి జీవితం నేటి ఆధునిక సమాజానికి ఆదర్శనీయమని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కే.భాస్కరరెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా భాస్కర రెడ్డి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర రెడ్డి మాట్లాడుతూ జ్ఞానం ఉంటే మనిషి సాధించలేనిదేమీ లేదని వాల్మీకి నిరూపించారన్నారు. సీపీఓ అప్పలకొండ మాట్లాడుతూ రామాయణం రచన ద్వారా సీతారాముల సద్గుణాలు, కుటుంబ విలువలు, పాలనా సూత్రాలు, సమాజ శ్రేయస్సు వంటి ఎన్నో జీవన సూత్రాలను వాల్మీకి మహర్షి అందించారన్నారు. బీసీ వెల్ఫేర్ అధికారి బి. శశాంక మాట్లాడుతూ రామాయణం సామాజిక నీతిని బోధించే గ్రంథం అని, వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలతో, ఏడు కాండలతో మానవాళికి అద్భుతమైన కావ్యాన్ని అందించారన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే.ఎన్.జ్యోతి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ముత్యాల సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి జయంతి