
తప్పులతడకల్లో స్మార్ట్
● ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో
స్మార్ట్ కార్డులు
● జిల్లాలో ఇప్పటికే
80 శాతం పైగా కార్డుల పంపిణీ
● చిరునామా, పేర్లు తప్పుగా ప్రచురణ
● ఎక్కడ మార్చుకోవాలో తెలియని దుస్థితి
● కార్డుదార్లకు తప్పని అవస్థలు
సాక్షి, రాజమహేంద్రవరం: అనుకున్నదొకటి.. అయ్యిందొకటి.. అన్న చందంగా ఉంది కూటమి సర్కారు తీరు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాల ముద్రను చెరిపేసేందుకు కూటమి సర్కారు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్యశ్రీ వంటి వాటి పేర్లు మార్చేసింది. తాజాగా రేషన్ కార్డులను సైతం మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. స్మార్ట్ కార్డుల పేరిట గతంలో ఉన్న గత ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులు అందించే ప్రక్రియ ప్రారంభించింది. ఈ ప్రక్రియ హడావుడిగా చేపట్టడంతో స్మార్ట్ కార్డులు తప్పుల తడకలుగా ఉన్నాయని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. వారి వివరాలు సక్రమంగా ముద్రించకుండా, మరోసారి పరిశీలించకుండానే స్మార్ట్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేసేసింది. కొత్త కార్డులను పరిశీలించిన లబ్ధిదారులు అవాక్కవుతున్నారు. తమ పేర్లు తప్పున్నాయని కొందరు, చిరునామా మారిందని మరికొందరు గగ్గోలు పెడుతున్నారు. స్మార్ట్ కార్డుల పేరిట హడావుడి చేసి, క్రెడిట్ కొట్టేద్దామనుకున్న ప్రభుత్వానికి చివరకు ప్రజల నుంచి ఛీత్కారాలే ఎదురవుతున్నాయి.
ఇదీ సంగతి
జిల్లావ్యాప్తంగా 871 రేషన్ షాపులున్నాయి. వీటి పరిధిలో 5,64,994 రేషన్ కార్డులున్నాయి. వీటి ద్వారా 15,77,393 మందికి ప్రతి నెలా ప్రభుత్వం బియ్యం, చక్కెర, కందిపప్పు తదితర నిత్యావసర సరకులు అందిస్తోంది. కార్డుదార్లకు ఇప్పటి వరకూ రేషన్ కార్డులను ఎప్పటి నుంచో మాన్యువల్‌గా తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. ఇలా కాదని, తాము వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టామని, స్మార్ట్ కార్డులు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అనుకున్నదే తడవుగా ఎలాంటి పరిశీలనా లేకుండానే ఇష్టమొచ్చినట్లు కార్డులు ముద్రించేసింది. ఆగమేఘాల మీద వాటి పంపిణీ సైతం ప్రారంభించింది. ఈ బాధ్యతను గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి, రేషన్ డీలర్లకు అప్పజెప్పింది. అయితే, దీనిని డీలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతి నెలా 20 రోజుల పాటు తాము రేషన్ సరకులు పంపిణీ చేయాల్సి ఉందని, అదనంగా కార్డుల పంపిణీ కూడా ఎలా చేపట్టాలగలమని లోలోపల మధనపడుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే తమను ఎక్కడ ఇబ్బందులు పెడతారోనని మిన్నకుండిపోతున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 80 శాతం పైగా స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు.
అడ్రస్సులే మారిపోయాయ్
స్మార్ట్ కార్డుల ముద్రణలో ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ తీవ్ర నిర్లక్ష్యం చూపాయనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా అనేక కార్డుల్లో సమాచారం తప్పుల తడకగా ఉంది. కొన్ని కార్డుల్లో లబ్ధిదార్ల పేర్లలో అచ్చుతప్పులున్నాయి. మరికొన్నింటిలో ఏకంగా ఇంటి అడ్రస్సులే మార్చేశారు. గ్రామం పేరు, పూర్తి పేరు, జిల్లా పేర్లలో సైతం తప్పులు దొర్లాయి. ఈ తప్పులను ఎక్కడ, ఏవిధంగా సరిదిద్దుకోవాలో తెలియక లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఆధార్ కేంద్రాలకు వెళ్లాలని అధికారులు చెబుతూండటంతో అక్కడ పడిగాపులు పడుతున్నారు.
ప్రభుత్వం చేసిన తప్పులకు తమ జేబులకు చిల్లు పడుతోందని ఆవేదన చెందుతున్నారు. చదువు రాని వారు, కార్డులపై అవగాహన లేని వారు సరిదిద్దుకోలేక మిన్నకుండిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా.. తప్పులతో ముద్రించడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రచార ఆర్భాటం కోసం ఇలా తమ జీవితాలతో ఆడుకుంటారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏవైనా సమస్యలు, ఆస్పత్రులు, ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించాలంటే రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడు తప్పులతడకగా ఇచ్చిన స్మార్ట్ కార్డులను బ్యాంకులు, వివిధ శాఖలు ఆమోదించడం లేదని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. కార్డుల ముద్రణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలో రేషన్ కార్డుల వివరాలు
మండలం కార్డుల సంఖ్య
అనపర్తి 22,488
బిక్కవోలు 22,480
చాగల్లు 21,072
దేవరపల్లి 25,416
గోకవరం 22,644
గోపాలపురం 21,128
కడియం 29,138
కోరుకొండ 26,991
కొవ్వూరు 33,320
నల్లజర్ల 27,554
నిడదవోలు 34,483
పెరవలి 23,233
రాజమహేంద్రవరం రూరల్ 50,511
రాజమహేంద్రవరం అర్బన్ 83,403
రాజానగరం 36,324
రంగంపేట 19,778
సీతానగరం 24,085
తాళ్లపూడి 16,811
ఉండ్రాజవరం 24,135

తప్పులతడకల్లో స్మార్ట్