
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు విద్యార్థుల ఎంపిక
అంబాజీపేట: రాష్ట్ర స్థాయి తైక్వాండో అండర్–14, 17 విభాగాల్లో పోటీలకు పలువురు విద్యార్థులు ఎంపికై నట్లు సీనియర్ కోచ్ పితాని త్రిమూర్తులు తెలిపారు. ఈ నెల 4న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ తైక్వాండో పోటీలు కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరిగాయని అన్నారు. ఇందులో విజేతలు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ తైక్వాండో పోటీలకు హాజరవుతారని త్రిమూర్తులు వివరించారు. కాగా అంబాజీపేటకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికైన వారిలో ఉన్నారన్నారు. ఇందులో అండర్–14 బాలికల విభాగంలో కె.సుందరి హరిప్రియ, వై.ఇషా శ్రీనిజ, ఎం.మౌనిక, అండర్–14 బాలుర విభాగంలో బి.హేమ హృతిక్, అండర్–17 బాలికల విభాగంలో పి.చరణ్యశ్రీలు ఉన్నారన్నారు. ఎంపికై న విద్యార్థులను హెచ్‌ఎం కడలి సాయిరాం, పీడీ ఉమా మహేశ్వర్, కుంపట్ల ఆదిలక్ష్మి, సూర్యకుమారి, క్రీడాకారులు అభినందించారు.