
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మొండిచేయి
అల్లవరం: ప్రతి పండగకు ఉద్యోగులకు డీఏ లేదా పీఆర్సీ, ఐఆర్ ఏదొకటి ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి నేతలు, తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచేయి చూపారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆదివారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. ఇది ఉద్యోగుల ప్రభుత్వమని, నూతన పీఆర్సీని ప్రకటిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, డీఏ బకాయిలు చెల్లిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కూటమి నేతలు, 16 నెలల్లో ఉద్యోగులకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. 16 నెలల కాలంలో ఒక్క డీఏ ప్రకటించారా అని ప్రశ్నించారు. ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని విమర్శించారు. పండగ వచ్చిన ప్రతిసారీ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఉద్యోగులకు తీవ్ర నిరాశ తప్పడం లేదన్నారు. ఉద్యోగులకు ఇస్తామన్న రూ. 30 వేల కోట్లు ఎప్పుడు ఇస్తున్నారో ప్రకటించాలని, ఈ దీపావళికి పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు ప్రకటించాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.