బీసీవై పార్టీ అధినేత నిర్బంధం
● రామచంద్ర యాదవ్‌ను
హోటల్‌లో నిర్బంధించిన పోలీసులు
● పోలీసులకు, ఆయన సెక్యూరిటీకి మధ్య ఘర్షణ
● రాజమహేంద్రవరంలో తీవ్ర ఉద్రిక్తత
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తున్న మత్స్యకారులు, రైతులకు అండగా నిరసనకు పిలుపునిచ్చిన భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్‌ను పోలీసులు ఆదివారం రాజమహేంద్రవరం షెల్టాన్ హోటల్‌లో నిర్బంధించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పాయకరావుపేట నియోజకవర్గంలోని రాజయ్యపేటలో మత్స్యకారులు, రైతులకు మద్దతుగా నిరసన తెలిపేందుకు బీసీవై పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు గాను రామచంద్ర యాదవ్ రాజమహేంద్రవరం చేరుకుని షెల్టాన్ హోటల్‌లో బస చేశారు. ఆయనకు నక్కపల్లి పోలీసులు ఇచ్చిన నోటీసులను అందించేందుకు రాజమహేంద్రవరం సౌత్, సెంట్రల్ జోన్ డీఎస్పీలు భవ్య కిషోర్, శ్రీకాంత్‌ల ఆధ్వర్యాన ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసులు అధిక సంఖ్యలో ఆ హోటల్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వై కేటగిరీ భద్రత ఉన్న రామచంద్ర యాదవ్ సెక్యూరిటీ సిబ్బందికి, రాజమహేంద్రవరం పోలీసులకు మధ్య హోటల్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. రామచంద్ర యాదవ్ గదిలో నుంచి బయటకు వస్తూండగా సెక్యూరిటీని పోలీసులు తోసివేశారు. అనంతరం ఆయనకు పోలీసులు నోటీసు అందించి, గదిలోకి పంపించి, బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో రామచంద్ర యాదవ్ తిరిగి పుంగనూరు వెళ్లేందుకు ప్రయత్నించగా బయటకు రాకుండా నిలుపుదల చేశారు. మధ్యాహ్నం ఆయన పుంగనూరుకు బయల్దేరుతూ విలేకర్లతో మాట్లాడారు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ బాధితులైన మత్స్యకారులు, రైతులకు మద్దతుగా బీసీవై పార్టీ నిరసన తెలపడానికి వెళ్తూంటే పోలీసులు శాంతిభద్రతల సమస్య పేరు చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. వారు నోటీసు ఇవ్వడంతో తిరిగి పుంగనూరు వెళ్లడానికి ప్రయత్నిస్తే రూమ్‌లో నుంచి బయటకు రాకుండా నిర్బంధించే ప్రయత్నం చేశారని చెప్పారు. దీనిపై న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. హైకోర్టు అనుమతితో వారం పది రోజుల్లో నక్కపల్లి మండలంలో పర్యటించి, మత్స్యకాలకు, రైతులకు మద్దతుగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం వ్యవసాయ భూములు, మత్స్యకారులుండే తీర ప్రాంత భూములను బలవంతంగా లాక్కొని, వారి జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకు రావాలనే చిత్తశుద్ధి ఉంటే లక్షలాది ఎకరాల బీడు భూములు, సెజ్‌ల కోసం సేకరించిన భూములు ఉన్నాయని చెప్పారు. తీర ప్రాంతాలు, పంట భూములపై కన్నేసి పారిశ్రామికాభివృద్ధి పేరిట రూ.వేల కోట్ల చీకటి ఒప్పందాలకు, కుట్రలకు తెర తీస్తోందని ఆరోపించారు.


