చీరమేను... అధరేను | - | Sakshi
Sakshi News home page

చీరమేను... అధరేను

Oct 6 2025 2:42 AM | Updated on Oct 6 2025 2:42 AM

చీరమే

చీరమేను... అధరేను

మార్కెట్‌లోకి విరివిగా చేపలు

బకెట్‌ ధర రూ.28 వేలు

అయినా దొరకని వైనం

యానాం: చీరమేను.. ఈ పేరు చెబితేనే నోరూరుతోంది.. గోదారోళ్లకు పులస తర్వాత అత్యంత ప్రియమైన చేప ఇది. చిన్న సైజులో ఉండే చీరమేనును అంతా లొట్టలేసుకుని ఆరగిస్తారంటే, దాని రుచే వేరని చెప్పకనే అర్థమవుతోంది. సీజనల్‌ చేప కావడంతో ముఖ్యంగా సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో శీతాకాలం ప్రారంభంలో దొరుకుతోంది. ఇది గోదావరి నదీ ముఖద్వారం వద్ద అంటే (తీపినీరు), సముద్రం (ఉప్పునీరు) కలిసే ప్రాంతాల్లో లభిస్తుంది. చీరమేనును సోల, సేరు, తవ్వ, గ్లాసు, బకెట్‌ కొలతల్లో విక్రయిస్తుంటారు. యానాం మార్కెట్‌లో ఇది అధికంగా లభిస్తుండటంతో మాంసాహార ప్రియులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ వేలం ద్వారా ఈ చేపలను విక్రయిస్తుండడం విశేషం. ఆదివారం ప్లాస్టిక్‌ బకెట్‌లో ఉన్న సుమారు 10 సేర్ల చీరమేను ధర రూ.28 వేలు పలికింది. ఇలా చీరమేనుకు అధిక ధర లభిస్తుండడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నదీ ముఖద్వారంలో లభ్యం

సుమారు అంగుళం సైజులో ఉండే చీరమేను చేపలను వలలతో పట్టడం సాధ్యం కాదు. దీనిని చీరల సహాయంతో గోదావరి ముఖ ద్వారాల్లో మత్స్యకారులు పడుతుంటారు. చీరలతో పట్టడం వల్లే దీనికి చీరమేను అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. సముద్రం, నదీ కలిసే ప్రాంతాల వద్ద చల్లగా వీచే తూర్పు గాలులకు నీటి అడుగుభాగంలో ఉన్న చీరమేను కాస్తా పైకి వస్తుంది. ముఖ్యంగా దసరా నుంచి దీపావళి వరకూ అధికంగా లభిస్తుంది. ఇది ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో సమృద్ధిగా ఉన్న లిజర్డ్‌ఫిష్‌ జాతికి చెందినదిగా చెబుతుంటారు.

అబ్బబ్బా... ఆ రుచే వేరు

చీరమేనును మామూలు చేపల కూరలా కాకుండా ప్రత్యేక విధానంలో వండుతుంటారు. దీనిని చాలామంది చింతకాయ, చింతకూర వేసుకుని ఇగురు పెడతారు. అంతేకాకుండా గారెలుగా వేసుకుని ఆరగిస్తారు. వివిధ రకాలుగా చీరమేనును ప్రైగా సైతం చేసుకుంటారు. ఈ రుచికి అలవాటు పడిన వారు ఎంతైనా కొనుగోలు చేస్తారని వినియోగదారులు అంటున్నారు.

ఎక్కడ లభిస్తుందంటే..

గౌతమీ గోదావరి నది నీరు యానాం వద్ద బంగాళాఖాతంలో భైరవపాలెం సమీపంలో కలుస్తుంది. ఈ ప్రాంతంలో చీరమేను ఎక్కువగా లభిస్తుంది. ఇక్కడ పడిన చీరమేనును యానాం మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. దూర ప్రాంతాల్లోని తమ బంధువులకు ఈ చేపలను స్థానికులు తీసుకెళ్తుంటారు. జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు విశాఖ, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు కూరగానో, ఐస్‌లో పెట్టో పంపుతుంటారు. అందుకే వీటికి డిమాండ్‌ పెరుగుతోంది.

చీరమేను... అధరేను1
1/2

చీరమేను... అధరేను

చీరమేను... అధరేను2
2/2

చీరమేను... అధరేను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement