కోకో.. ఇచ్చింది తీస్కో | - | Sakshi
Sakshi News home page

కోకో.. ఇచ్చింది తీస్కో

Oct 6 2025 2:18 AM | Updated on Oct 6 2025 2:18 AM

కోకో.

కోకో.. ఇచ్చింది తీస్కో

దేవరపల్లి: మార్కెట్లో కోకో గింజల ధర రోజురోజుకూ పతనమవుతోంది. దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ధర లేకపోవడంతో నష్టపోతున్నామని రైతులు దిగులు చెందుతున్నారు. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభం నుంచే కోకో మార్కెట్‌ ఒడుదొడుకుల్లో ఉంది. కొనుగోలు సంస్థలు సిండికేట్‌గా ఏర్పడి మార్కెట్లో ధర పెరగకుండా తమ కష్టాన్ని దోచుకుంటూ.. ఇచ్చింది తీసుకోవాలన్నట్టు వ్యవహరిస్తున్నాయని రైతులు వాపోతున్నారు.

రివ్వున ఎగసి.. రయ్యిన జారి..

గతంలో కిలో గింజలకు రూ.250 మాత్రమే ధర లభించేది. అటువంటిది ఒక దశలో ఒకేసారి రూ.1,050 పలకడంతో రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. 2023 పంట కాలంలో ఎకరాకు ఆరేడు క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వింటాల్‌ ధర ఏకంగా రూ.1.10 లక్షలు పలికింది. ఎకరాకు సుమారు ఆరేడు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. దీంతో, రైతులు మంచి లాభాలు అందుకుని, ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఈ ధర ఆ ఏడాది ఏప్రిల్‌ వరకూ ఉంది. అనంతరం కిలో రూ.500 నుంచి రూ.700కు తగ్గింది. కోకో గింజలకు మంచి ధర లభిస్తూండటంతో పలువురు కౌలుదారులు దూకుడు పెంచారు. ఎకరం తోటను ఏకంగా రూ.1.50 లక్షలకు కౌలుకు తీసుకున్నారు. 2024–25 పంట కాలంలో దిగుబడి తగ్గడంతో పాటు ధర పడిపోయింది. ఒక దశలో గింజలు కొనే నాథుడు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీజన్‌ ప్రారంభంలో కిలో గింజలకు రూ.700 నుంచి రూ.750 ధర పలికింది. తాము ఇచ్చిందే తీసుకోవాలనే రీతిలో కంపెనీలు వ్యవహరించడంతో ధర రానురానూ రూ.400కు పతనమైంది. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర ఇవ్వాలని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతులు ఆందోళనలు నిర్వహించారు. వారి ఆగ్రహం తమకు చేటు తెస్తుందని భావించిన ప్రభుత్వం రైతుల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపింది. కంపెనీలు ప్రతి కిలో గింజలకు ఇస్తున్న రూ.450కి అదనంగా రూ.50 చెల్లిస్తామని కంటితుడుపుగా ప్రకటించి, చేతులు దులుపుకొంది. అయితే, ప్రస్తుతం కోకో గింజల ధర మరింత పతనమై, కిలోకు రూ.300 నుంచి రూ.350 మాత్రమే పలుకుతోంది. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కో రైతు 10 నుంచి 20 ఎకరాలు కౌలుకు తీసుకుని ఈ పంట సాగు చేస్తున్నారు. ఇప్పుడు లభిస్తున్న ధర ఎంత మాత్రమూ గిట్టుబాటు కాదని, కనీసం రూ.800 ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

కోలుకోవడం కష్టం

కోకో రైతులు కోలుకోవడం కష్టంగా ఉంది. కౌలుదారుల పరిస్థితి మరీ దారుణం. ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ కౌలు రైతులు నష్టపోయారు. రైతులు కంపెనీలకు తీసుకెళ్లి వారు చెప్పిన రేటుకు అమ్ముకోవాల్సి వస్తోంది. తప్పలు, తాలు ఉన్నాయని కంపెనీలు ధర తగ్గించేస్తున్నాయి. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కిలో గింజల ధర రూ.1,050 ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.750కి, మార్చి, ఏప్రిల్‌ నెల ల్లో రూ.450కి.. ఇప్పుడు రూ.350కి పడిపోయింది.

– గడా రాంబాబు,

రైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం

ధర పడిపోయింది

నేను ఏడెకరాల్లో కోకో సాగు చేస్తూండగా ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించి మార్కెట్‌ బాగుంటే కోకో పంట లాభసాటిగా ఉంటుంది. గత ఏడాది ఎకరాకు ఆరేడు క్వింటాళ్ల దిగుబడి రాగా, కిలోకు రూ.1,050 ధర పలికింది. ఈ ఏడాది సీజన్‌లో దిగుబడి సగానికి తగ్గింది. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ధర రూ.450 నుంచి రూ.500 వరకూ పలికింది. ధర పడిపోవడంతో కౌలు రైతులు దెబ్బ తిన్నారు.

– కొయ్యలమూడి వేణు,

రైతు, కురుకూరు, దేవరపల్లి మండలం

13,538 ఎకరాల్లో సాగు

ఫ పతనమైన గింజల ధర

ఫ రైతుకు దక్కుతున్నది కిలోకు

రూ.300 మాత్రమే..

ఫ కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బ

ఫ ముప్పుతిప్పలు పెడుతున్న కంపెనీలు

జిల్లావ్యాప్తంగా 18 మండలాల్లో 13,538 ఎకరాల విస్తీర్ణంలో రైతులు కోకో సాగు చేస్తున్నారు. దీనిని అదనపు ఆదాయం కోసం కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటగా సాగు చేస్తున్నారు. ధర బాగా లభిస్తే ప్రధాన పంటల కంటే కోకో ద్వారానే వారికి అధిక ఆదాయం లభిస్తూంటుంది. చాగల్లు, దేవరపల్లి, నిడదవోలు, నల్లజర్ల మండలాల్లో దాదాపు 12 వేల ఎకరాల్లో రైతులు కోకో సాగు చేస్తున్నారు. ఒక్క దేవరపల్లి మండలంలోని కురుకూరు, పల్లంట్ల గ్రామాల్లోనే సుమారు 900 ఎకరాల్లో కోకో సాగు జరుగుతోంది. కురుకూరులో 700 ఎకరాల్లో దీని సాగు జరుగుతూండగా.. ఇందులో సుమారు 500 ఎకరాల్లో ప్రకృతి సాగు పద్ధతుల్లో రసాయనిక, పురుగు మందుల అవశేషాలు లేని గింజలను రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. డిసెంబరులో తోటలు పూతలు వచ్చి, ఫిబ్రవరి నుంచి జూన్‌ నెల వరకూ గింజల దిగుబడి వస్తుంది. కోకో గింజలను ప్రధానంగా చాక్‌లెట్‌, ఐస్‌క్రీమ్‌ల తయారీలో వినియోగిస్తారు. ఈ గింజలను క్యాడ్‌బరీ, మోర్జీ సంస్థలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. గతంలో ఆయా కంపెనీల ప్రతినిధులు నేరుగా రైతుల ఇళ్లకు వచ్చి గింజలు కొనుగోలు చేసి తీసుకు వెళ్లేవారు. అటువంటిది ఈ ఏడాది రైతులే కంపెనీలకు చెందిన సేకరణ కేంద్రాల వద్దకు తీసుకు వెళ్లి అమ్ముకోవలసి వస్తోంది.

కోకో.. ఇచ్చింది తీస్కో1
1/4

కోకో.. ఇచ్చింది తీస్కో

కోకో.. ఇచ్చింది తీస్కో2
2/4

కోకో.. ఇచ్చింది తీస్కో

కోకో.. ఇచ్చింది తీస్కో3
3/4

కోకో.. ఇచ్చింది తీస్కో

కోకో.. ఇచ్చింది తీస్కో4
4/4

కోకో.. ఇచ్చింది తీస్కో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement