
బస్సు, రైలు కిటకిట
రాజమహేంద్రవరం సిటీ: దసరా పండగకు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోని స్వస్థలాలకు వచ్చిన వారు సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో, రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఆదివారం ఒక్కసారిగా కిక్కిరిసిపోయాయి. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు తదితర నగరాలకు తిరిగి వెళ్లే వారు బస్సులు, రైళ్ల కోసం బస్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బస్సులలో సీట్ల కోసం ప్రయాణికులు పోటీ పడటంతో కొన్ని సందర్భాల్లో తోపులాటలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నుంచి రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా సుమారు 175 బస్సులు నడుపుతున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) వైఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాలకు రెగ్యులర్ బస్సులతో పాటు ప్రయాణికుల రద్దీని అనుసరించి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని చెప్పారు. కొవ్వూరు, నిడదవోలు, గోకవరం, రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోల నుంచి ప్రధానంగా విజయవాడకు అధిక సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు అధిక సంఖ్యలో వస్తే మరిన్ని బస్సులు నడిపేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశామని డీపీటీఓ తెలిపారు. ఇక రైళ్లలో వెళ్లే వారు రిజర్వేషన్ లేకపోయినా.. ఆ బోగీల్లో సైతం ఎక్కి ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు.
ఫ ముగిసిన దసరా సెలవులు
ఫ తిరుగు ప్రయాణమైన జనం
ఫ రద్దీగా మారిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

బస్సు, రైలు కిటకిట