
మూడో అంతస్తు నుంచి కిందపడ్డ తల్లీబిడ్డలు
● తల్లికి తీవ్ర గాయాలు
● స్వల్ప గాయాలతో బిడ్డ సురక్షితం
● సత్యగిరిపై విష్ణుసదన్‌లో ఘటన
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని సత్యగిరిపై ఉన్న విష్ణుసదన్ సత్రం మూడో అంతస్తు గోడ పైనుంచి అదుపుతప్పి తల్లి, కుమారుడు కిందపడ్డారు. ఈ ఘటనలో తల్లికి రెండు కాళ్లు విరిగిపోగా, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే, శుక్రవారం రాత్రి విష్ణుసదన్ సత్రంలోని మూడో అంతస్తులో 27, 28 నంబర్ హాళ్లలో జరిగిన వివాహానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురానికి చెందిన శ్యామల సింధు తన మూడేళ్ల కుమారుడు శ్యాకేత్‌రామ్‌తో కలిసి వచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో శ్యామల సింధు తన కుమారుడు శ్యాకేత్ రామ్‌కు 28 హాలు ఎదురుగా పిట్టగోడపై కూర్చోబెట్టి అన్నం తినిపిస్తోంది. కుమారుడు హఠాత్తుగా వెనక్కు పడిపోతుండడంతో ఆమె గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ అదుపుతప్పి కింద మట్టిలో పడిపోయారు. కుమారుడిని గట్టిగా పట్టుకోవడంతో ముందు తల్లి పడగా, ఆమైపె కుమారుడు పడ్డాడు. నేరుగా నేలపై పడకుండా, రెండో అంతస్తు కిటికీ సన్‌షేడ్‌పై పడి.. అక్కడి నుంచి కిందపడ్డారు. ఈ ధాటికి సన్‌షేడ్ విరిగిపోయింది. ఈ ఘటనలో శ్యామల సింధు బలంగా నేలను తాకడంతో రెండు కాళ్లూ విరిగిపోయాయి. ఆమైపె ఉన్న కారణంగా కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి, పెళ్లి బృందాల వారు వెంటనే 108కు ఫోన్ చేయగా, సిగ్నల్స్ లేకపోవడంతో హరిహర సదన్ సత్రం నుంచి సమాచారం అందించారు. గంట తర్వాత అంబులెన్స్ చేరింది. క్షతగాత్రులను కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తొండంగి పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.
భక్తుల ఆగ్రహం
రత్నగిరిపై సత్రాలు, పెళ్లిళ్ల సీజన్‌లో మండపాలు కేటాయించి దేవస్థానం అధికారులు చేతులు దులుపుకొంటున్నారని, తర్వాత వారిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విష్ణుసదన్‌లో 36 హాళ్లు ఉన్నాయి. కొందరు రెండు హాళ్లు తీసుకుని పెళ్లిళ్లతో పాటు, భోజనాలూ అక్కడే ఏర్పాటు చేసుకుంటారు. రాత్రయితే అక్కడ అంతా అయోమయం. విద్యుత్ సరఫరా నిలిచిపోతే.. పునరుద్ధరణకు చాలా సమయం పడుతుంది. గతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినపుడే పెళ్లికి హాజరైన మహిళ మెడలో బంగారు గొలుసును దుండగుడు అపహరించాడు. అక్కడ పోలీసులే కాదు.. కనీసం ప్రైవేట్ సెక్యూరిటీ ఉండడం లేదనే విమర్శ ఉంది. అక్కడ సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. ఎటువంటి సంఘటనలు జరిగినా పోలీసులకు, దేవస్థానం అధికారులకు కానీ వెంటనే సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. ఆయా సమస్యలను దేవస్థానం అధికారులు చక్కదిద్దాలని భక్తులు కోరుతున్నారు.

మూడో అంతస్తు నుంచి కిందపడ్డ తల్లీబిడ్డలు

మూడో అంతస్తు నుంచి కిందపడ్డ తల్లీబిడ్డలు