
కెనరా బ్యాంకు నూతన శాఖలు ప్రారంభం
చాగల్లు/నల్లజర్ల: రెండు చోట్ల కెనరా బ్యాంకు నూతన శాఖలను బ్యాంక్ విజయవాడ జనరల్ మేనేజర్ సీజే విజయలక్ష్మి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. చాగల్లు, నల్లజర్ల బస్టాండ్ వద్ద ఆయా శాఖలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు, వ్యాపారులతో పాటు, అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కెనరా బ్యాంకు లక్ష్యమన్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.మాధవరావు మాట్లాడుతూ, డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరు సహా, అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. బంగారం తాకట్టు, పంట, ముద్ర రుణాలు అందిస్తామన్నారు. బ్రాంచ్ మేనేజర్లు ప్రవీణ తోట, సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సినీ నటి శ్రీరెడ్డికి నోటీసు
రాజమహేంద్రవరం రూరల్: ఐటీ యాక్ట్ కింద నమోదైన కేసులో సినీ నటి మల్లిడి శ్రీరెడ్డికి 35 బీఎన్‌ఎస్ నోటీసును బొమ్మూరు ఎస్సై రమేష్ శనివారం జారీ చేశారు. గతేడాది నవంబర్ 12న టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై ఐటీ యాక్ట్ కింద బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్తున్న శ్రీరెడ్డికి లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఎస్సై రమేష్, మహిళా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌తో వెళ్లి నోటీసు అందజేశారు.
స్కూల్స్ గేమ్స్ ఉమ్మడి జిల్లా ఎంపికలు రేపు
ప్రకాశంనగర్ (రాజమహేంద్రవరం): నగరంలోని ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్కూల్స్ గేమ్స్ ఎంపికలు నిర్వహించినున్నట్టు డీఈవో కె.వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫుట్‌బాల్ అండర్–14 బాలురు, బాలికలు, కరాటే అండర్–14, 17 బాలురు, బాలికల విభాగాల్లో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఆయా క్రీడాంశాల్లో పాల్గొనే వారు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని తెలిపారు. వివరాలకు స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఏవీడీ ప్రసాదరావు 98853 10089 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
ప్రపంచ బాడ్మింటన్ పోటీలకు న్యాయ నిర్ణేతగా సాయిబాబు
తొండంగి: వరల్డ్ జూనియర్ బాడ్మింటన్ చాంపియన్ షిప్‌కు న్యాయనిర్ణేతగా మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన క్రీడాకారుడు, కోచ్ సువర్ణం సాయిబాబు ఎంపికయ్యారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసోం రాష్ట్రం గౌహతిలో ఈ నెల ఆరు నుంచి 19 వరకు జరగనున్న ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలకు న్యాయనిర్ణేతగా నియమిస్తూ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) నుంచి ఉత్తర్వులు అందాయని చెప్పారు. ఈ పోటీలకు సుమారు 46 దేశాలకు చెందిన క్రీడాకారులు హాజరవుతారన్నారు. ఎంపికైన సాయిబాబుకు ఏపీ, తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ సంఘ కార్యదర్శులు అంకమ్మచౌదరి, బాలసుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారు.

కెనరా బ్యాంకు నూతన శాఖలు ప్రారంభం

కెనరా బ్యాంకు నూతన శాఖలు ప్రారంభం