
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల నిర్వహణ
ఏపీ వాలీబాల్ కోచ్ ముదునూరి
కొత్తపేట: యువతను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీల నిర్వహణకు కృషి చేస్తున్నట్టు ఏపీ వాలీబాల్ కోచ్ ముదునూరి చలపతి రామకృష్ణంరాజు తెలిపారు. ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామానికి చెందిన రామకృష్ణంరాజు ప్రస్తుతం హైదరాబాద్‌లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. తన స్వగ్రామం తాడిపూడి వచ్చిన ఆయన శనివారం వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను దేవస్థానం తరఫున అధికారులు, అర్చకులు వేదమంత్రోచ్ఛరణతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణంరాజు విలేకరులతో మాట్లాడుతూ, గ్రామీణ క్రీడలైన వాలీబాల్, కబడ్డీ, ఖోఖో వంటి వాటిలో యువత రాణించాలన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆరోగ్యంతో పాటు, మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. స్పోర్ట్స్‌మన్ కోటాలో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఇటీవల డీఎస్సీలో 900 మంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారని, వీరిలో వాలీబాల్ క్రీడాకారులు 50 మంది ఉన్నారని తెలిపారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి ఓసారి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ల నిర్వహణకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. తద్వారా యువతలో క్రీడలపై ఆసక్తి పెరుగుతుందన్నారు.