
చమురు సంస్థలతో నిరుద్యోగ భృతి ఇప్పించాలి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు డిమాండ్
అమలాపురం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాగూ నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, కనీసం కోనసీమ నుంచి రూ.కోట్ల విలువైన నిక్షేపాలను తరలించుకుపోతున్న చమురు సంస్థల నుంచి ఈ ప్రాంత యువతకు నిరుద్యోగ భృతి ఇప్పించేందుకు చొరవ చూపాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. దాదాపు 40 ఏళ్లుగా కోనసీమలో చమురు సంస్థలు రూ.కోట్ల లాభాలు ఆర్జిస్తున్నా, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు చేసిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోనసీమ నేల నుంచి తవ్వుతున్న నిక్షేపాలతో చమురు సంస్థలు రూ.వేల కోట్లతో వ్యాపారాలు చేస్తున్నా.. చంద్రబాబు ఏ రోజూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయా సంస్థలను ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. దాదాపు రూ.50 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చమురు సంస్థల నుంచి రాయల్టీ రూపంలో రావాల్సి ఉండగా, ప్రధాని మోదీకి భయపడి చంద్రబాబు ప్రశ్నించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పైపెచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల రాష్ట్రానికి నాలుగు పెద్ద యూనివర్శిటీలు ప్రపంచ దేశాల నుంచి తెచ్చానని ఘనంగా చెబుతున్నారన్నారు. జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్‌లో ఎప్పుడో విదేశీ యూనివర్శటీలకు కార్పొరేట్ రంగంలో డబ్బు వసూలు చేసుకోవచ్చంటూ ఆయన చట్టం తెచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రానికి మంజూరైన పెట్రోలియం యూనివర్శిటీ ఉత్తరప్రదేశ్‌కు తరలిపోతున్నా ఉలుకూ పలుకు లేకుండా ఉండిపోయారని దుయ్యబట్టారు. చంద్రబాబు మాటలను నమ్మే స్థితిలో నిరుద్యోగులు లేరన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ నాయకుడు ముంగర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.