
సహేతుకంగా పుష్కరాల పనుల అంచనాలు
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టే పనులకు అంచనాలను సహేతుకంగా రూపొందించాలని జిల్లా కలెక్టర్, ఇన్‌చార్జ్ కమిషనర్ కీర్తి చేకూరి నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. తొలుత 21 రహదారుల విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ముందుగా కోరుకొండ రోడ్డు, ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు, మోరంపూడి జంక్షన్ – శ్యామలా టాకీస్ రహదారి విస్తరణ పనులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రతి రోజూ మంచినీటి పరీక్షలు చేయాలన్నారు. ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల వద్ద కూడా ఈ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పుష్కర పనులకు సంబంధించి క్రౌడ్ మేనేజ్‌మెంట్, ఘాట్ల అభివృద్ధి, ట్రాఫిక్ మళ్లింపు, రోడ్ల అభివృద్ధి తదితర అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై చర్చించారు. పుష్కరాల పేరిట తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీర్ఘకాలిక విధానంలో రహదారుల విస్తరణ, మౌలిక వసతుల కల్పన, పర్యాటకంగా నగరాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పుష్కరాలకు వచ్చే యాత్రికుల వసతికి పాఠశాలలు, కల్యాణ మండపాలు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు చూడాలన్నారు. ప్రతి ఘాట్ వద్ద పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ జి.శైలజ వల్లి, సిటీ ప్లానర్ జి.కోటయ్య, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) సీపీఓ జీవీఎస్‌ఎన్ మూర్తి, ఎస్‌ఈ (ఇన్‌చార్జి) రీటా, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.