
సౌత్ ఏషియన్ బాక్సింగ్‌కు యోగితాకుమారి
మామిడికుదురు: ఎస్‌జీఎఫ్‌ఐ సౌత్ ఏషియన్ బాక్సింగ్ పోటీలకు గెద్దాడ గ్రామానికి చెందిన చిట్టూరి యోగితాకుమారి ఎంపికై ంది. ఈ పోటీలు త్వరలో బెంగళూరులో జరుగుతాయని జాతీయ బాక్సింగ్ కోచ్ చిట్టూరి చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. సీఐఎస్‌సీఈ జాతీయ బాక్సింగ్ పోటీలు గత నెల 25 నుంచి 27 వరకు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగాయి. ఆ పోటీల్లో 48 కిలోల విభాగంలో యోగితాకుమారి బంగారు పతకం గెలుపొందిందని చంద్రశేఖర్ తెలిపారు. తద్వారా సౌత్ ఏషియన్ బాక్సింగ్ పోటీలకు ఎంపికై ందన్నారు. యోగితాకుమారి ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.
రైల్వే ఫ్లై ఓవర్ కింద
యువకుడి మృతదేహం
గుర్తు పట్టలేనంతగా ముఖంపై గాయాలు
తుని: పట్టణంలో రైల్వే ఫ్లైఓవర్ కింద నర్సీపట్నం బస్టాండ్ సమీపంలో యువకుడి మృతదేహం ఉండటం శుక్రవారం ఉదయం కలకలం రేపింది. దారుణమైన గాయాలతో, ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ శ్రీహరిరాజు, తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఇతర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ను, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ముఖంపై ఉన్న గాయాలను బట్టి కొట్టి చంపేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే యువకుడు ఎవరనేది వివరాలు తెలియకపోవడంతో ఈ ఘటన స్థానికంగా జరిగిందా లేక వేరే ప్రాంతంలో కొట్టి చంపి ఇక్కడకు తీసుకొచ్చి పడేశారా? అన్నకోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం ముఖం మీద తప్ప శరీరంపై ఎక్కడ గాయాలు కనిపించడం లేదు. సమీపంలో ఉన్న ఒక మద్యం బాటిల్‌ను పోలీసులు సేకరించి అది ఎక్కడ కొనుగోలు చేసిందనే దానిపై ఆరా తీస్తున్నారు. చనిపోయిన వ్యక్తి సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. సిబ్బంది మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.