వాటాలివ్వాలంటూ లూఠీ! | - | Sakshi
Sakshi News home page

వాటాలివ్వాలంటూ లూఠీ!

Sep 30 2025 7:39 AM | Updated on Sep 30 2025 7:39 AM

వాటాలివ్వాలంటూ లూఠీ!

వాటాలివ్వాలంటూ లూఠీ!

సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి నేతల నేతృత్వంలోని సిండికేట్‌ మద్యం విక్రయాల్లో అడ్డగోలు వ్యవహారానికి తెర తీసింది. ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీని ఏమాత్రం లెక్క చేయకుండా మరీ అమ్మకాలకు బరితెగిస్తోంది. క్వార్టర్‌పై రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తోంది. ఇక రాత్రయితే ధర మరింత పెంచి, రూ.30 వరకూ గుంజుతోంది. అదనపు వసూళ్లతో తమ జేబులకు చిల్లు పెడుతున్నారని మందుబాబులు నిలదీస్తే.. పర్మిట్‌ రూముల కోసం ప్రభుత్వానికి చెల్లించాలని, కూటమి నేతలకు, కొంత మంది అధికారులకు వాటాలివ్వాలని చెబుతున్నారు. ఈవిధంగా అక్రమంగా రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు.

దోచేస్తున్నారిలా..

● రాజమహేంద్రవరం రూరల్‌ ఐఎంఎల్‌ డిపో పరిధిలో జిల్లాలోని రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌తో పాటు అల్లూరి సీతారామరాజు, కోనసీమ జిల్లాలున్నాయి. ఈ ప్రాంతంలోని 134 మద్యం షాపులకు ప్రతి నెలా దాదాపు 1.17 లక్షల వివిధ రకాల మద్యం కేసులు, 44,300 బీర్‌ కేసులు సరఫరా చేస్తూంటారు. వీటి విలువ రూ.103 కోట్లు. పండగల సమయాల్లో అయితే వ్యాపారం మరింత ఊపందుకుంటుంది. ఇదే అదునుగా వ్యాపారులు అదనంగా దోచేస్తున్నారు. ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేస్తే.. మద్యం కేసులకు రూ.11.70 లక్షలు, బీర్లకు రూ.4.43 లక్షల మేర మందుబాబుల నుంచి గుంజుతున్నారు. అదే రూ.20 చొప్పున వసూలు చేస్తే ఆ భారం రూ.23.40 లక్షలకు పెరుగుతోంది.

● చాగల్లు ఐఎంఎల్‌ డిపో నుంచి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఏలూరు పరిధిలోని 111 షాపులకు మద్యం సరఫరా అవుతోంది. ప్రతి నెలా సుమారు 43,743 మద్యం కేసులు, 13,354 బీర్‌ కేసులు సరఫరా చేస్తున్నారు. దీని ప్రకారం మద్యం కేసులకు రూ.4.37 లక్షలు, బీర్లకు రూ.1.33 లక్షల మేర మందుబాబులకు అదనంగా వదిలిపోతోంది. రూ.20 చొప్పున లెక్క వేస్తే మద్యం కేసులకు రూ.8.74 లక్షలు, బీర్లకు రూ.2.66 లక్షల మేర అదనపు భారం పడుతోంది.

పర్మిట్‌ రూముల పేరిట..

మద్యం ద్వారా ప్రస్తుతం వస్తున్న ఆదాయం చాలదని భావించిన కూటమి ప్రభుత్వం దీనిని మరింతగా పెంచుకునేందుకు ప్రతి మద్యం దుకాణానికి అనుబంధంగా పర్మిట్‌ రూములకు అనుమతులు ఇచ్చేసింది. జిల్లావ్యాప్తంగా 125 మద్యం షాపులుండగా.. ఒక్కో షాపునకు ఒక్కో పర్మిట్‌ రూము చొప్పున ఏర్పాటు చేశారు. కార్పొరేషన్‌, మున్సిపాలిటీ పరిధిలో పర్మిట్‌ రూమ్‌కు రూ.7.50 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం వసూలు చేసింది. సగటున ఒక్కో షాపునకు రూ.5 లక్షలు వసూలు చేసినా.. ప్రభుత్వానికి అదనంగా రూ.62 కోట్ల ఆదాయం ఏటా సమకూరనుంది. పర్మిట్‌ రూముల కోసం ప్రభుత్వానికి చెల్లించిన మొత్తాన్ని దండుకునే లక్ష్యంతో మందుబాబులను సిండికేట్‌ అదనపు వసూళ్ల పేరిట ఎడాపెడా బాదేస్తోంది.

స్పందించని అధికారులు

అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా, బెల్టు షాపులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నా దీనిని అరికట్టేందుకు ఏర్పాటైన ఎకై ్సజ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం, అధికారులు కనీసంగా కూడా స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం దుకాణాల ఆధ్వర్యంలో బెల్టు షాపులు నిర్వహిస్తే ఆ షాపును రద్దు చేస్తామని స్వయంగా సీఎం చంద్రబాబే ప్రకటించారు. కానీ, వాస్తవానికి క్షేత్ర స్థాయిలో ప్రతి షాపు పరిధిలో 30కి పైగా బెల్ట్‌ షాపులు నడుస్తున్నాయి. ఇది బహిరంగ రహస్యమే అయినప్పటికీ ఎకై ్సజ్‌ అధికారులు ఒక్క షాపుపై కూడా దాడులు చేసిన దాఖలాలు లేవు. వారిపై కేసులు నమోదు చేయడంలో ఎకై ్సజ్‌ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మద్యం వ్యాపారులతో కొంత మంది పోలీసులు సైతం మిలాఖత్‌ అయ్యారనే ఆరోపణలున్నాయి. మద్యం షాపుల నుంచి కొంత మంది ఎకై ్సజ్‌, పోలీసు అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతున్నాయని, అందుకే అధికంగా వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మందుబాబులు మండిపడుతున్నారు. కొన్నిచోట్ల ఎకై ్సజ్‌, పోలీసు అధికారులు మీది మీరు తీసుకోండి.. మాది మేము తీసుకుంటామన్నట్టుగా వ్యహరిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.

మద్యం విక్రయాల్లో కూటమి సిండికేట్‌ దోపిడీ

క్వార్టర్‌పై రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు

పర్మిట్‌ రూముల నిర్వహణ,

మామూళ్లకు అంటూ బుకాయింపు

రాత్రయ్యేకొద్దీ మరింత పెరుగుతున్న ధర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement