
కూటమి అరాచకాలకు డిజిటల్ బుక్‌తో బుద్ధి చెబుతాం
● ఎవ్వరినీ వదిలిపెట్టం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు
● డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరణ
రాజమహేంద్రవరం రూరల్: అధికార మదంతో కూటమి నాయకులు, కార్యకర్తలు, వారికి వంత పాడుతున్న అధికారులకు బుద్ధి చెప్పేందుకే తమ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్ బుక్‌ను తీసుకొచ్చారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలసి ఆయన సోమవారం డిజిటల్ బుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెడ్ బుక్ పేరుతో వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపించి వేధిస్తోందని మండిపడ్డారు. దీనికి కారకులైన వారిని తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే డిజిటల్ బుక్ ద్వారా చట్టబద్ధంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అక్రమంగా పెట్టిన ప్రతి కేసుకూ ఈ డిజిటల్ బుక్ సమాధానంగా ఉంటుందని చెప్పారు. కార్యకర్తలకు, ప్రజలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సులువుగా సమాచారం అందించేందుకే డిజిటల్ బుక్ పెట్టామని తెలిపారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అధికారులపై భవిష్యత్తులో చర్యలు తప్పవని వేణు హెచ్చరించారు. పాలకుల ఆదేశాలతో వైఎస్సార్ సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టేలా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తే భవిష్యత్తులో ఎక్కడున్నా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. బాధితులు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను డీబీ.డబ్ల్యూఈవైఎస్సార్‌సీపీ.కామ్ అనే వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చన్నారు. 040–49171718 నంబర్‌కు కాల్ చేసి కూడా తెలపవచ్చని వేణు చెప్పారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, కడియం మండల అధ్యక్షుడు యాదల సతీష్‌చంద్ర స్టాలిన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల వీర్రాజు (బాబు), మింది నాగేంద్ర, వివిధ విభాగాల నేతలు ఎంఎం ఆలీ, పడాల వీర రాఘవరెడ్డి, అంగాడి సత్యప్రియ, తాడాల చక్రవర్తి, దాసరి శివ, పెయ్యల రాజేష్, బొప్పన సుబ్బారావు, యెజ్జు వాసు, ముత్యాల పోసికుమార్, జిల్లా కార్యదర్శులు యెనుముల త్యాగరాజు, తాడాల విష్ణు, రాజమౌళి, ముద్దాల అను, వివిధ విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు పాల్గొన్నారు.